Share News

పంచాయతీ నిధులకు గండి

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:55 AM

కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు తెచ్చుకోవడానికి వీలుగా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు ముందే నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు.

పంచాయతీ నిధులకు గండి

  • రాష్ట్ర ఆడిట్‌ శాఖ నిర్లక్ష్యమే కారణం

  • సకాలంలో నివేదికలు అప్‌లోడ్‌ చేయడంలో వైఫల్యం

  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ముప్పు

  • గతేడాది రూ.50 కోట్లు నష్టం.. ఈ ఏడాదీ అదే తీరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు తెచ్చుకోవడానికి వీలుగా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు ముందే నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పైసా కూడా వదలొద్దని, ఢిల్లీ వెళ్లైనా సరే సాధించుకోవాలని నిర్దేశించారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ఎలాంటి సాయమైనా చేస్తుందని కలెక్టర్లకు, కార్యదర్శులకు ఆయన భరోసా ఇచ్చారు. కానీ, అదే ఆర్థిక శాఖ పరిధిలోని ఆడిట్‌ విభాగం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఆర్థిక శాఖ కూడా పెద్దగా స్పందించడం లేదు. సొంత కార్యాలయాల్లో కూర్చుని సకాలంలో ఆడిట్‌ నివేదికలను కేంద్రప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే పంచాయతీలకు వందల కోట్ల నిధులొస్తాయి. కానీ, ఆడిట్‌ అధికార గణం ఆ పని కూడా చేయడం లేదు. దీంతో గతేడాది రూ.50 కోట్ల నష్టం జరిగింది. అయినప్పటికీ ఈ ఏడాది కూడా ఆడిట్‌ విభాగం అదే తీరు కొనసాగిస్తోంది. గతంలో ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ట్రెజరీ ద్వారా పంచాయతీ ఖాతాలకు బదిలీ చేసేది. కానీ, ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలకు దారి మళ్లిస్తుండడంతో కేంద్రం వాటిని నేరుగా పంచాయతీ ఖాతాలకు బదిలీ చేస్తోంది. ఈ నిధులను నిబంధనల మేరకు ఖర్చు పెట్టారా? లేదా దుర్వినియోగం చేశారా? అన్నది తెలుసుకోడానికి రాష్ట్ర ఆడిట్‌ శాఖ ఇచ్చే నివేదికే కేంద్ర ప్రభుత్వానికి ఆధారం. ఇలాంటి నివేదికలను అప్‌లోడ్‌ చేయడం కోసం కేంద్రం ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆడిట్‌ శాఖ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల ఆడిట్‌ పూర్తి చేసి ఆర్థిక సంవత్సరం ముగిసే తేదీ(మార్చి 31) నాటికి కేంద్రం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో ఆ నివేదికలను అప్‌లోడ్‌ చేయాలి. కానీ, ఈ నివేదికలను సకాలంలో సమర్పించడంలో రాష్ట్ర ఆడిట్‌ శాఖ విఫలమైంది.


దీంతో గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు దాదాపు యాభై కోట్ల మేర నిధులు కోల్పోయాయి. అయినప్పటికీ రాష్ట్ర ఆడిట్‌ శాఖ తీరు మారలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 403 గ్రామపంచాయతీలు, 64 మండల పరిషత్‌ల ఆడిట్‌ నివేదికలు ఇంకా అప్‌లోడ్‌ చేయలేదు. దీంతో ఈ సంస్థలు ఆర్థిక సంఘం నిధులు కోల్పోయే ప్రమాదం ఉంది. పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం పంచాయతీల ఆడిట్‌ డిసెంబరు 31 నాటికి పూర్తికావాలి. నివేదికల తయారీకి 3 నెలల సమయం ఉంటుంది. మార్చి 31 నాటికి వాటిని కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ నిబంధన తీసుకొచ్చారు. ఆడిట్‌లు సకాలంలోనే ముగిశాయి. కానీ, నివేదికలు ఇంకా అప్‌లోడ్‌ కాలేదు. పెండింగ్‌లో ఉన్న మొత్తం 403 నివేదికల్లో జోన్‌-2 పరిధిలోనే 241 ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న జోనల్‌ అధికారులు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఈ జోన్‌లో పెండింగ్‌లో 241 నివేదికల్లోనూ 165 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఒక్క మండలం నివేదిక కూడా అప్‌లోడ్‌ కాలేదు. రాష్ట్రస్థాయి అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో కూడా నివేదికలు ఎక్కువగానే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అవకాశం ఉన్న చోటల్లా నిధులు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నప్పటికీ ఆడిట్‌ శాఖ మాత్రం లెక్క చేయడం లేదు.

Updated Date - Apr 10 , 2026 | 03:55 AM