వైసీపీ ఓ విషవృక్షం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:30 AM
వైసీపీ ఓ విష వృక్షమని, ఆ పార్టీని వెయ్యి అడుగులు గొయ్యి తీసి బయటికి రాకుండా చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్‌రెడ్డి: మంత్రి అచ్చెన్న
పార్వతీపురం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఓ విష వృక్షమని, ఆ పార్టీని వెయ్యి అడుగులు గొయ్యి తీసి బయటికి రాకుండా చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై మంగళవారం పార్వతీపురంలో సభ నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘వెన్నుపోటుకు, గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి. మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. ఇంతకన్నా విష ప్రచారం మరొకటి ఉంటుందా? ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా?. తల్లి, చెల్లి పాదయాత్ర చేస్తే జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వారిద్దరికీ ఆస్తిలో కూడా వాటా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు’ అని విమర్శించారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యమంత్రి చంబ్రాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖామంత్రి లోకేశ్‌పై ఉన్న నమ్మకంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయి.. వస్తున్నాయి’ అని అచ్చెన్న అన్నారు. వరి సాగు అన్నివేళలా లాభదాయకం కాదని, అలాంటప్పుడు ప్రత్నామ్నాయ పంటల వైపు రైతులు దృష్టిపెట్టాలని మంత్రి అచ్చెన్న కోరారు. గోదావరి జిల్లాల్లో అంతర పంటగా కోకో వేయడం వల్ల రైతులు మంచి ఆదాయం పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.