Share News

ఏ క్షణంలో అయినా..!

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:46 AM

‘నా కుటుంబాన్ని అంతం చేయడానికే దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా?’ అంటూ రెచ్చిపోతున్న మాజీ మంత్రి జోగి రమేశ్‌కు సంకెళ్లు వేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా దారుణం, అప్రజాస్వామికం అని బల్లగుద్దుతున్న రమేశ్‌... అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి దిగడానికి ఆయన కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలే కారణమని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే జోగి రమేశ్‌పై మైలవరానికి చెందిన కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో రమేశ్‌ ఇంటిపై దాడి చేసిన ఘటన పైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 40 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. వారిలో 12 మందిని ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం వారిని స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.

ఏ క్షణంలో అయినా..!

జోగి అరెస్టుకు రంగం సిద్ధం!

రమేశ్‌ ఇంటిపై దాడి కేసులో 12 మంది టీడీపీ నేతల అరెస్టు

స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

40 మందిపై కేసులు నమోదు

జోగి ఇంటి వద్ద ‘ఫోరెన్సిక్‌’ నమూనాల సేకరణ

(ఆంధ్రజ్యోతి - విజయవాడ/ఇబ్రహీంపట్నం):

‘నా కుటుంబాన్ని అంతం చేయడానికే దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా?’ అంటూ రెచ్చిపోతున్న మాజీ మంత్రి జోగి రమేశ్‌కు సంకెళ్లు వేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా దారుణం, అప్రజాస్వామికం అని బల్లగుద్దుతున్న రమేశ్‌... అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి దిగడానికి ఆయన కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలే కారణమని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే జోగి రమేశ్‌పై మైలవరానికి చెందిన కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో రమేశ్‌ ఇంటిపై దాడి చేసిన ఘటన పైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 40 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. వారిలో 12 మందిని ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం వారిని స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.

250 మంది టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు

మరోపక్క జోగి రమేశ్‌ కార్యాలయంలో పనిచేసే మూలపాడు రాంబాబు అనే వ్యక్తి దాడిపై మరో ఫిర్యాదు చేశారు. 250 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు జోగి రమేశ్‌ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 90 మంది ఆందోళనకారుల పేర్లను రాసి పోలీసులకు ఇచ్చారు. జోగి రమేశ్‌, ఆయన కుటుంబ సభ్యులను హతమార్చడానికే ఈ దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు కావడంతో దర్యాప్తును వేర్వేరు బృందాలు సాగిస్తున్నాయి. దాడికి సంబంధించిన కేసును ఒక బృందం, రమేశ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన కేసును మరో బృందం దర్యాప్తు చేస్తున్నాయి. ఘటన జరగడానికి ముందు రోజున ఇబ్రహీంపట్నంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన జోగి రమేశ్‌ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై నోరు పారేసుకున్నారు. దాని కారణంగానే టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయని గుర్తించారు. దీంతో జోగి రమేశ్‌ను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అరెస్టు సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అడుగులు ముందుకు వేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఏ క్షణంలో అయినా జోగి చేతులకు బేడీలు వేసే యోచనలో ఉన్నారు. ఆయన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. క్లూస్‌ టీం బృందాలు ఆయన వద్దకు చేరుకున్నాయి. ప్రధాన ద్వారం, మొదటి అంతస్తు బాల్కనిలో నమూనాలను సేకరించాయి. ఇబ్రహీంపట్నం రింగ్‌ వద్ద నుంచి ఫెర్రీ రోడ్డు చివరి వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ఫుటేజీల ద్వారా ఫొటోలను సేకరించి ఆందోళనకారులను గుర్తిస్తున్నారు.

‘మంట’ ఎలా రేగింది?

తన ఇంటిపైకి పెట్రోలు బాంబు విసిరారని జోగి రమేష్‌ ఆరోపిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దాడికి సంబంధించి కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇందులో ఒక ఆందోళనకారుడు సీసాను విసిరినట్టు కనిపిస్తోంది. అది మొదటి అంతస్తు బాల్కనిలో గోడకు తగిలి కింద పడినట్టు ఉంది. గాజు సీసా నేలపై పడగానే మంటలు రేగాయి. ఈ మంటలు ఎలా పుట్టాయన్న దానిపై ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. పెట్రోలు బాంబులను వెలిగించి విసురుతారు. ఆ సీసాలు పగలగానే మంటలు మొత్తం పెట్రోలుకు వ్యాపిస్తాయి. వీడియోల్లో సీసా గాల్లో ఉన్నప్పుడు దానికి ఎలాంటి మంటలు కనిపించలేదు. సీలింగ్‌కు తగిలి కింద పడగానే మంటలు రేగాయి. దీనిపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలు చూసినప్పుడు సీసాకు ఎలాంటి మంటలు కనిపించలేదని, ఆ మంటలు ఎలా వచ్చాయో తెలియడం లేదని ఓ పోలీస్‌ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నామన్నారు.

సీపీ ఆగ్రహం

జోగి రమేశ్‌ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఇబ్రహీంపట్నం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ప్రభావం ఇబ్రహీంపట్నాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ఉప్పందించాయి. జోగి రమేశ్‌ ఇంటికి టీడీపీ కార్యకర్తలు వెళ్లబోతున్నారన్న సమాచారం ఇచ్చాయి. ముందస్తు సమాచారం వచ్చినా టీడీపీ శ్రేణులను జోగి ఇంటి వరకు వెళ్లకుండా నిలువరించలేకపోయారు. దీనిపై సోమవారం సీపీ ఇబ్రహీంపట్నం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - Feb 03 , 2026 | 12:46 AM