Share News

ఆ భూమి రికార్డులు తారుమారు

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:09 AM

విజయనగరంలో గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజుకు చెందిన భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయింపు వివాదంమలుపులు తిరుగుతోంది.

ఆ భూమి రికార్డులు తారుమారు

  • నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయానికి కేటాయింపు

  • అశోక్‌ భూమి వివాదంపై ప్రభుత్వానికి నివేదిక

విజయనగరం, జూలై 1(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజుకు చెందిన భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయింపు వివాదంమలుపులు తిరుగుతోంది. నిబంధనలను పక్కనపెట్టి భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో.. 2022లో విజయనగరం తహసీల్దార్‌గా పనిచేసిన ప్రభాకర్‌రావు రికార్డులను తారుమా రు చేసినట్లు అధికారులు గుర్తించారు. విజయనగరం రాజవంశీకులకు చెందిన ఎస్టేటు భూములను వైసీపీ కార్యాలయానికి ఎలా కేటాయించారంటూ గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సర్వే అండ్‌ బౌండరీస్‌ యాక్ట్‌-1923లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ యజమానికి నోటీసు ఇవ్వకుండా భూమిని మార్పు చేసినట్లు అశోక్‌గజపతిరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై జిల్లా అధికారులు విచారణ జరిపి, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. సర్వే నంబరు 569లో ఎకరాభూమిలో ఉన్న చెరువును ప్రభుత్వ భూమిగా మార్పు చేసి, 2022 మే 18న జారీ చేసిన జీవో నంబరు 350 ప్రకారం ఆ స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు ఇచ్చారు. ఈమేరకు అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో మున్సిపల్‌ కౌన్సిల్‌లో సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో వైసీపీ తీర్మానాన్ని ఆమోదించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయానికి అప్పటి ఆర్డీవో, తహసీల్దార్‌ భూమిని కేటాయించినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది.

అది ఎర్ర చెరువు: దాసన్నపేట సమీపంలో వైసీపీ కార్యాలయం నిర్మించిన ప్రదేశాన్ని గతంలో ఎర్రచెరువుగా పిలిచేవారు. ఈ స్థలం రాజాసాహెబ్‌ ఆఫ్‌ విజయనగరం వారి పేరున టౌన్‌ సర్వే రిజిస్టర్‌(టి.ఎస్.ఆర్‌) నంబరు 569లో 4.74 ఎకరాలుగా నమోదైంది. అయితే సర్వే అండ్‌ బౌండరీస్‌ యాక్ట్‌ 1923 నిబంధనల ప్రకారం చెరువును ప్రభుత్వ భూమిగా మార్చే అధికారం తహసీల్దార్‌కు లేదని, చెరువును ప్రభుత్వ స్థలంగా మార్చి వైసీపీకి ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు అంటున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 03:09 AM