నాటి అరాచకానికి నేడు అండ!
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:52 AM
జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరినీ వదల్లేదు. వైసీపీ నేతల అరాచకాలకు అధికారులూ వంత పాడారు.
గజపతి రాజుల భూముల కేసులో కొత్త కోణం
నాటి కలెక్టర్, ఆర్డీవోను కాపాడేందుకు ప్రయత్నం
జగన్ హయాంలో వైసీపీ ఆఫీసుకు ఎకరం స్వాహా
ప్రైవేటు భూమి అడ్డగోలుగా ప్రభుత్వ భూమిగా మార్పు
మండల స్థాయిలోనే నిర్ణయం.. కలెక్టర్, ఆర్డీవోల ఆమోదం
కూటమి వచ్చాక గతేడాది కలెక్టర్‌కు అశోక్ ఫిర్యాదు
నేటికీ జరగని న్యాయం.. విచారణ కూడా చేయని వైనం
పాపమంతా నాటి తహశీల్దార్‌పై నెట్టేసేందుకు యత్నం
మంత్రి వద్ద పనిచేస్తున్న ఓ డిప్యూటీ కలెక్టర్ చక్రం
ఆయనది.. రాజుల కుటుంబం. టీడీపీ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గోవా గవర్నర్. ఆయనే అశోక్‌గజపతి రాజు! ఆయన కుటుంబానికి చెందిన భూమినే గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వైసీపీ ఆఫీసు నిర్మాణం కోసం స్వాహా చేశారు. ఇందుకు నిబంధనలు ఉల్లంఘించి మరీ నాటి విజయనగరం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ సహకరించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక 2025లో అశోక్‌గజపతి రాజు ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. అయినా న్యాయం జరగలేదు. కనీసం విచారణ కూడా చేయలేదు. తప్పు చేసిన అధికారులను కాపాడేందుకు కొందరు బరితెగించారు. నాటి కలెక్టర్, ఆర్డీవోను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
(అమరావ తి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరినీ వదల్లేదు. వైసీపీ నేతల అరాచకాలకు అధికారులూ వంత పాడారు. విజయనగరం గజపతి రాజుల ప్రైవేటు భూములను అడ్డగోలుగా కొట్టేయడమే ఇందుకు నిదర్శనం. నాడు అధికారులను పావులుగా చేసుకొని వైసీపీ నేతలు విలువైన భూమిని పార్టీ ఆఫీసు కోసం దక్కించుకున్నారని స్పష్టమవుతోంది. నాటి ప్రభుత్వ పెద్దలు, నేతల ప్రోద్భలం, ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు లేని అధికారాలు తెచ్చిపెట్టుకొని విలువైన భూముల రికార్డులను తారుమారు చేశారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు బయటకొచ్చింది. నాడు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నించడమే దారుణం. కింది స్థాయిలో కేవలం ఒకరిద్దరిని బలిచేసి, పెద్దసార్లను కాపాడేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలా? లేక తూతూమంత్రంగా చర్యలు తీసుకోవాలా? అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
నాడు ఏం జరిగిందంటే..
గోవా గవర్నర్ అశోక్‌గజపతి రాజు కుటుంబానికి విజయనగరం మహారాజుపేటలో సర్వే నం.569లో 4.60 ఎకరాల భూమి ఉంది. 2021 ఫిబ్రవరికి ముందు ఆ భూమి ప్రైవేటు-(ట్యాంక్) అని రికార్డుల్లో ఉంది. తర్వాత దాన్ని రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చారని అశోక్‌గజపతిరాజు చెబుతున్నారు. ఇది నిజమే. రెవెన్యూ రికార్డుల ప్రకారం రింగ్‌రోడ్డు వెంటే ఈ భూమి ఉంది. దీనిపై నాడు వైసీపీ కన్నుపడింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిని పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం తీసుకోవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. రికార్డులను మారిస్తే ప్రైవేటుగా ఉన్నది కాస్తా ప్రభుత్వ భూమిగా మారిపోతుందని, ఆ తర్వాత ప్రతిపాదనలు పంపిస్తే తాము చూసుకుంటామని నేతలు అధికారులను కోరారు. పెద్దలు చెప్పిందే తడవుగా 2022 జనవరిలో 4.60 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా(ఏడబ్ల్యూడీ)గా రికార్డుల్లో మార్చారు. తర్వాత ఈ భూమిని పార్టీ ఆఫీసు కోసం కేటాయించాలని వైసీపీ కోరింది. ఈ వినతిపై నాటి ప్రభుత్వం కలెక్టర్ నివేదిక కోరింది. అంతే.. సర్వే నం.569లో ఎకరం భూమిని వైసీపీ ఆఫీసుకు ఇవ్వొచ్చని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి చేరింది. వైసీపీ నేతలు కోరుకున్నట్లుగానే లీజు ప్రాతిపదికన ఎకరం భూమిని ఆ పార్టీకి 2022లో కేటాయించారు.
అడుగడుగునా అధికార దుర్వినియోగం
రాజుల కుటుంబానికి సంబంధించిన ప్రైవేటు భూమిని ప్రభుత్వానిదిగా రికార్డు మార్చడంలో నాడు గ్రామస్థాయి నుంచి కలెక్టరేట్ వరకు నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం జరిగిందని స్పష్టమవుతోంది.
ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చాలంటే సర్వే సరిహద్దుల చట్టమే కాదు, ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం కూడా ముందు హక్కుదారులకు నోటీసులు ఇవ్వాలి. ఈ నిబంధన పాటించలేదు.
569 సర్వే నంబర్‌లో చెరువు అని రాసి ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా క్లాసిఫికేషన్(భూమి స్వభావం) మార్చాలంటే నిర్ణయాధికారం తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు లేదు. క్లాసిఫికేషన్ మార్చాలని ఫైలును కలెక్టర్ నుంచి రెవెన్యూసెక్రటరీకి పంపించాలి. ఆ తర్వాత అధికారికంగా సర్వే నం. 569లోని చెరువును ప్రభుత్వభూమిగా క్లాసిఫికేషన్ మారుస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇదేదీ జరగలేదు. తహశీల్దార్ స్థాయిలోనే భూమి క్లాసిఫికేషన్ మార్చేశారు. ఆర్డీవో, కలెక్టర్ మౌఖిక ఆదేశాలు, వైసీపీ నేతల ఒత్తిళ్లు లేకుండా తహశీల్దార్ తనకు లేని అధికారాన్ని చెలాయించగలరా? జూ సర్వే నం.569లోని ఎకరం భూమిని వైసీపీకి ఇవ్వాలనుకున్నప్పుడు నాటి కలెక్టర్, ఆర్డీవో భూమి రికార్డులు పరిశీలించారు. 2021 ఫిబ్రవరికి ముందు ఆ భూమి స్వభావం ఏమిటి? ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా ఎప్పుడు మారింది? చెరువుగా ఉన్న భూమి ఏడబ్ల్యూడీగా ఎలా మారిందో వారు నిశిత పరిశీలన చేస్తే అప్పుడే అసలు విషయం బోధపడేది. కానీ వాళ్లు అవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఆ భూమిని తాము వ్యక్తిగతంగా పరిశీలించి వచ్చామని నాటి ఆర్డీవో, కలెక్టర్‌లు నివేదికలు ఇచ్చారు. జూ రికార్డుల్లో చెరువుగా ఉన్న భూమిని ఏడబ్ల్యూడీ(ప్రభుత్వ)గా ఎలా మార్చారు? ఈ అధికారం తహశీల్దార్‌కు ఎవరిచ్చారు? అని ఇటు ఆర్డీవో, అటు కలెక్టర్ ఆరాతీయలేదు. ఆ భూమి రికార్డుల పూర్వాపరాల్లోకి వెళ్లి పూర్తి వివరాలు ఆరా తీయలేదు. అంటే.. ఈ భూమి స్వభావం ఏమిటో వారికి ముందే తెలిసి ఉండాలి? లేదా నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు అయినా ఉండి ఉండాలి? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ డిప్యూటీ కలెక్టర్ మంత్రాంగం
గజపతి రాజుల భూమిపరాధీనం కేసులో ఓ డిప్యూటీ కలెక్టర్ మంత్రాంగం నడిపారని తెలిసింది. ప్రస్తుతం ఓ కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న ఆయన గతంలో రాయలసీమలో ఆర్డీవోగా పనిచేశారు. వైసీపీకి భక్తుడు. అక్రమాలు, అరాచకాలు, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే పనుల్లో ఆరితేరిన వారిని కాపాడటం, వారిపై విజిలెన్స్, ఏసీబీ కేసులు ఎత్తివేయించడం, క్రమశిక్ష ణా చర్యలు లేకుండా చేయడంలో ఆయన దిట్ట అని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఈ కేసులో తన మిత్రుడైన నాటి ఆర్డీవోతో పాటు నాటి కలెక్టర్‌ను కాపాడేందుకు ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిపారని తెలిసింది. సీసీఎల్‌ఏ జయలక్ష్మికి పంపిన నివేదికలో వారి పాత్ర ప్రస్తావన లేకుండా ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. పనిలో పనిగా ఓ కీలక మంత్రి పేరును కూడా ఆయన వాడినట్లుగా తెలిసింది.
తహశీల్దార్‌ను బలిచేసేలా కుట్ర
గత ప్రభుత్వంలో తన భూమిని వైసీపీకి అక్రమంగా కట్టబెట్టారని 2025 లోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇటీవల అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఫిర్యాదు ఇచ్చినా కలెక్టర్ పట్టించుకోకపోవడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కలెక్టర్ ఏ చర్యలూ తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటో? లోతుల్లోకి వెళ్తే.. ప్రైవేటు భూమిని ప్రభుత్వ ఖాతాలోకి మార్చడం, ఆ తర్వాత చెరువుగా ఉన్న దాన్ని ఏడబ్ల్యూడీగా మార్చడం అనేది ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన ప్రక్రియ. కానీ ఇదంతా తహశీల్దార్ స్థాయిలోనే జరిగింది. ఇందులో తహశీల్దార్ తప్పు స్పష్టంగా ఉంది. అలాగే నాటి ఆర్డీవో, కలెక్టర్ వైఫల్యం, పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ భూమి విషయంలో విచారణ జరిగితే నాటి కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌ల వైఫల్యాలు, అధికార దుర్వినియోగం, తప్పులు బయటకొస్తాయి. దీంతో అందరిపైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది గమనించిన ఇద్దరు అధికారులు పెద్దలను ఆశ్రయించారు. కీలక స్థానాల్లో ఉన్న వారి శరణు కోరారు. అంతే.. తప్పంతా తహశీల్దార్‌దే అని నివేదికలు రూపొందించేలా వ్యూహం రచించారు. నాటి కలెక్టర్, ఆర్డీవో పాత్రల ప్రస్తావన లేకుండా, తహశీల్దార్ లేని అధికారాలను చెలాయించి నిర్ణయాలు తీసుకొన్నారని ప్రభుత్వానికి నివేదికలు పంపించేలా మంత్రాంగం నడిపారు. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల సీసీఎల్‌ఏకు కలెక్టర్ పంపించిన నివేదిక ఉంది. తప్పు తహశీల్దార్‌దే అని కలెక్టర్ ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నాటి కలెక్టర్, ఆర్డీవోల పాత్ర గురించి కలెక్టర్ ఒక్కమాట కూడా ప్రస్తావించలేదని తెలిసింది. ఈ నివేదిక చూసి రెవెన్యూ అధికారులు విస్తుపోతున్నారు. దీనివెనక ఒత్తిళ్లు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు.