Share News

ఆశాలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:34 AM

ఆశావర్కర్లు, సీహెచ్‌డబ్ల్యూలకు రూ.26 వేల కనీస వేతనం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు హెచ్చరించారు.

ఆశాలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి

  • ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మె: ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు

విజయవాడ (ధర్నాచౌక్‌), మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆశావర్కర్లు, సీహెచ్‌డబ్ల్యూలకు రూ.26 వేల కనీస వేతనం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నేతలు హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు వెట్టి చాకిరి చేస్తున్న ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అశావర్కర్లతో సమానంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు కేవలం రూ.4000 చెల్లించి, ఊడిగం చేయించుకోవడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు జీతాలు పెంచకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 30 శాతం పెంచుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్కీం వర్కర్లు, ఇతర కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని లేదా రూ.26 వేల కనీస వేతనం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


  • ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తాం

  • మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ప్రతినిధులతో గురువా రం సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఆశా వర్కర్లకు కొత్త సెల్‌ఫోన్లు, యూనిఫారాలు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దహన సంస్కారాల కింద రూ.15 వేలు చెల్లించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పా రు. మిగిలిన డిమాండ్లపై సీఎంతో చర్చిస్తానని హా మీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆశా వర్కర్ల యూనియన్‌ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

Untitled-5 copy.jpg

Updated Date - Mar 06 , 2026 | 04:37 AM