యూహెచ్‌ఎస్‌లో సేవలందించలేం
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:36 AM
ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించకుండా, ప్యాకేజీల రేట్లు పెంచకుండా యూనివర్సల్ హెల్త్ స్కీం(యూహెచ్‌ఎస్)లో భాగస్వామ్యమవడానికి...
ప్యాకేజీలు పెంచకుండా సాధ్యం కాదు: ఆషా
విజయవాడ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించకుండా, ప్యాకేజీల రేట్లు పెంచకుండా యూనివర్సల్ హెల్త్ స్కీం(యూహెచ్‌ఎస్)లో భాగస్వామ్యమవడానికి, సేవలందించడానికి సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్(ఆషా) స్పష్టం చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతూ, అనేక నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తమ ఆవేదనను వినిపిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిం ఆషా కార్యవర్గం ఆవేదన వ్యక్తం చేసింది. ఆషా రాష్ట్ర కార్యవర్గం విజయవాడలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆషా అధ్యక్షుడు డాక్టర్ కె.విజయకుమార్ మాట్లాడారు. ‘పాత బకాయిలను ఎప్పుడు, ఎలా తీరుస్తారో చెప్పకుండా యూనివర్సల్ హెల్త్ స్కీం(యూహెచ్‌సీ)ను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవడంపై సరికాదు. యూహెచ్‌సీని ఎలా రూపొందించారో మాకు తెలియదు. యూహెచ్‌సీ రూపకల్పనలో శాస్ర్తీయత లోపించింది. ఆచరణకు సాధ్యంకాని విధానంలో యూహెచ్‌సీ రూపకల్పన జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన పథకాన్ని రూపొందించేటప్పుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఇంత ఆర్థిక ఇబ్బందులు, నష్టాల్లో ఓటీఎ్‌సకు ఎందుకు అంగీకరిస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమన్న సామెతే ఈ ప్రశ్నకు సమాధానం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆషా కార్యదర్శి డాక్టర్ అవినాశ్, కార్యవర్గ సభ్యులు నాగమల్లేశ్వరరావు, గిరి, నారాయణరావు తదదితరులు పాల్గొన్నారు.