Share News

‘ఏఎస్‌సీ అర్జున్‌’.. ఆన్‌ డ్యూటీ!

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:49 AM

ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చెక్‌ పెట్టడంలో, ఇతర సేవల్లో రైల్వే రక్షణ దళానికి (ఆర్పీఎఫ్‌) సహకరించేందుకు ‘ఏఎ్‌ససీ అర్జున్‌’ రంగంలోకి దిగింది.

‘ఏఎస్‌సీ అర్జున్‌’.. ఆన్‌ డ్యూటీ!

  • దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం

  • రైల్వేస్టేషన్‌లో రోబో సేవలు ప్రారంభం

  • స్టేషన్‌లో దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గుర్తింపు

  • ప్రయాణికులకు భద్రతపై సూచనలు కూడా..

  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

విశాఖపట్నం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చెక్‌ పెట్టడంలో, ఇతర సేవల్లో రైల్వే రక్షణ దళానికి (ఆర్పీఎఫ్‌) సహకరించేందుకు ‘ఏఎ్‌ససీ అర్జున్‌’ రంగంలోకి దిగింది! భారతీయ రైల్వేలోనే తొలిసారిగా రోబో సేవలకు వాల్తేరు డివిజన్‌ శ్రీకారం చుట్టింది. ఈ హ్యూమనాయిడ్‌ రోబో ఆర్పీఎ్‌ఫకు అదనపు బలంగా అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ‘ఏఎ్‌ససీ అర్జున్‌’ పేరుతో రూపొందించిన ఈ రోబోను గురువారం వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అలోక్‌ బొహ్రా, వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీఎస్పీ ఏకే దూబే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఎల్‌వోటీ కనెక్టవిటీ, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌తో ‘ఏఎ్‌ససీ అర్జున్‌’ రోబోను రూపొందించడం జరిగిందన్నారు. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి అసిస్టెంట్‌ స్మార్ట్‌గా పనిచేస్తూ ప్రయాణికుల భద్రత, రక్షణ, ఇతర సేవలందిస్తుందని తెలిపారు. స్టేషన్‌లోని ఎనిమిది ప్లాట్‌ఫామ్‌లతోపాటు రైల్వే కార్యాలయాలు, పార్కింగ్‌ స్థలాల నావిగేషన్‌ను రోబోలో పొందుపరచడంతో విశేష సేవలందుతాయని అభిప్రాయపడ్డారు. ఆర్పీఎఫ్‌ ఐజీ అలోక్‌ బొహ్రా మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణను బలోపేతం చేయడంలో ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి మద్దతుగా ఈ రోబో పనిచేస్తుందన్నారు. తొలి రోబో సేవలకు శ్రీకారం చుట్టిన వాల్తేరు డివిజన్‌ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.


రోబో అందించే సేవలు ఇవీ..!

రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించి, జనసమూహంలో తిరిగే దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను ‘ఏఎ్‌ససీ అర్జున్‌’ ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌ ద్వారా గుర్తిస్తుంది. తద్వారా ఆర్పీఎఫ్‌ సిబ్బందిని హెచ్చరించి, అప్రమత్తం చేస్తుంది. రద్దీ సమయంలో ప్రయాణికులకు సందేశాలు ఇవ్వడంతో పాటు ఆర్పీఎఫ్‌ సిబ్బందికి నియంత్రణ సూచనలు జారీచేస్తుంది. భద్రత, సమాచార ప్రకటనలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసారం చేయడంతో పాటు ప్లాట్‌ఫామ్‌లపై నిరీక్షించే ప్రయాణికులకు భద్రతపై అవగాహన, సూచనలు, ప్రమాద హెచ్చరికలు జారీచేస్తుంది. స్టేషన్‌లో ప్రమాదాలు జరిగినప్పుడు వ్యాపించే మంటలు, పొగను ముందుగా గుర్తించి అప్రమత్తం చేస్తుంది.

Updated Date - Jan 23 , 2026 | 05:18 AM