Share News

ఉగాది కానుకగా..!

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:17 AM

టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశానికి ఉగాది పర్వదినాన్ని ముహూర్తంగా ప్రభుత్వం సన్నాహం చేస్తోంది.

    ఉగాది కానుకగా..!
కర్నూలు నగరం జగనాథగట్టులో నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్లు

టిడ్కో ఇళ్ల పంపిణీకి సన్నాహం

ఉమ్మడి జిల్లాలో గృహ ప్రవేశాలకు 3,424 ఇళ్లు సిద్ధం

మౌలిక వసతుల కల్పనలో జాప్యం

కర్నూలు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశానికి ఉగాది పర్వదినాన్ని ముహూర్తంగా ప్రభుత్వం సన్నాహం చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తే.. కూటమి ప్రభుత్వం సుమారు రెండేళ్లుగా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి ఇంత కాలంగా కూటమి ప్రభుత్వానికి తీరిక దొరకలేదు. దీని వల్ల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికిప్పుడు ఇండ్ల పంపిణీ చేయడానికి అనుకూలంగా లేవు. అయితే రాష్ట్రంలో లక్ష టిడ్కో ఇళ్లలోకి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న పట్టణ పేదలకు ఇదొక శుభవార్త. అయితే శిథిలమైపోయిన ఇండ్లకు మరమ్మతు చేయిస్తారా? కనీస వసతులు లేని ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తారా? అనే ప్రశ్న మిగిలే ఉంది. ఉమ్మడి జిల్లాలో 3,424 ఇండ్లను సిద్ధం చేయాల్సి ఉంది. .

రాష్ట్ర విభజన తరువాత ఆనాటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదలకు సొంతింటి స్వప్నం సాకారం చేయాలనే లక్ష్యంగా పీఎం అవాస్‌ యోజన - ఎన్టీఆర్‌ ఇళ్లు పథకంలో భాగంగా కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన, ఆళ్లగడ్డ పట్టణాల్లో 30,448 ఇళ్లను మంజూరు చేశారు. రూ.1,650 కోట్ల అంచనాతో షేర్‌వాల్‌ టెక్నాలజీతో జీ+3 ఇళ్ల సముదాయ నిర్మాణాలను ఏపీ టౌన ఇనఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన (ఏపీ టిడ్కో) ఇంజనీర్ల పర్యవేక్షణలో పెట్టారు. ఫేజ్‌-1 కర్నూలు నగర శివారున బైపాస్‌ రోడ్డు పక్కన 9,952, ఎమ్మిగనూరు పట్టణంలో 2,032, ఆదోనిలో 4,544 నంద్యాల పట్టణంలో 10 వేలు, ఫేజ్‌-2 కింద డోనలో 288. ఆళ్లగడ్డ పట్టణంలో 1,392 ఇళ్లు మంజరు చేశారు. అంటే.. రెండు విడతల్లో 30,448 ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. 23,645 ఇళ్లను దాదాపుగా పూర్తి చేశారు. మౌలిక వసతులు కల్పించి గృహ ప్రవేశాలు చేయాల్సిన సమయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఐదేళ్లు నిర్లక్ష్యం ఫలితంగా ఆ ఇళ్ల సముదాఆల్లో ముళ్లపొదలు నిండిపోయాయి. శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఫ ఉగాదికి గృహ ప్రవేశాలకు సన్నాహాలు:

ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 9,723 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 20 నెలలు టిడ్కో ఇళ్ల గురించి పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం ఏటీ టిడ్కో ఇళ్లపై సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు ఉగాది పర్వదినం రోజున లక్ష ఇళ్లను పేదలకు అప్పగించి గృహ ప్రవేశాలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ టిడ్కో అధికారులు, కాంట్రాక్టర్లలో చలనం వచ్చింది. దట్టంగా పేరుకుపోయిన ముళ్లపొదలు తొలగించడం, మౌలిక వసతులు కల్పించడంతో నిమగ్నమయ్యారు. కర్నూలు జిల్లాలో 3,120, నంద్యాల జిల్లాలో 304 ఇళ్లను ఉగాది రోజున గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన నెలలో కర్నూలు జిల్లాలో 9,701, నంద్యాల జిల్లాలో 7,600 ఇళ్లు పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.

ఫ మౌలిక వసతులు మృగ్యం:

టిడ్కో ఇళ్లను నగరం, పట్టణాలకు దూరంగా నిర్మించారు. ప్రధానంగా రోడ్లు, తాగునీరు, విద్యుత, మురుగు కాల్వలు.. వంటి కనీస మౌలిక వసతుల గురించి ఆనాటి టీడీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇండ్లు కట్టిస్తే సరి.. అన్నట్లు వ్యవహరించింది. నంద్యాలలో ఎంఎం నగర్‌ టిడ్కో ఇళ్లకు తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు.. వంటి పనులు కూటమి పాలనలో ఇప్పటికీ మొదలు పెట్టలేదు. ఎస్‌ఆర్‌బీసీ కాలనీ, అయ్యలూరుమెట్ట టిడ్కో ఇళ్ల వద్ద పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎమ్మిగనూరు పట్టణం శివన్న నగర్‌ ఏరియాలోని 320 టిడ్కో ఇళ్లకు తాగునీటి పైపులైన కనెక్షన ఇవ్వాల్సి ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకపోతే.. ఉగాది రోజున గృహ ప్రవేశాలు చేసినా.. ప్రభుత్వం ఘనంగా చెప్పుకోడానికి తప్ప లబ్ధిదారులకు ప్రయోజనం ఉండదు. . ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చిత్తశుద్ధి చాటుకోవాల్సి ఉంది.

ఫ ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్ల పురోగతి వివరాలు:

----------------------------------------------------------

నగరం/పట్టణం మంజూరైన ఇప్పటికే పంపిణీ ఉగాది రోజున జూన నెలలో

ఇళ్లు చేసిన ఇళ్లు గృహ ప్రవేశాలు గృహ ప్రవేశాలు

--------------------------------------------------------------

కర్నూలు నగరం 9,952 2,395 1,3992 6,165

ఆదోని 4,544 1,632 720 2,192

ఎమ్మినూరు 4,272 1,920 1,008 1,008

నంద్యాల పట్టణం 10,000 2,096 304 7,600

ఆళ్లగడ్డ 1,392 1,392 -- --

డోన 288 288 -- --

--------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 30,448 9,723 3,424 17,301

------------------------------------------------------------------------------------------------------------------------------------

ఫ ఉగాదికి 3,424 ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధం: సూర్యనారాయణ, ఈఈ, ఏపీ టిడ్కో, కర్నూలు:

ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో లక్ష టిడ్కో ఇళ్లు గృహ ప్రవేశాలు చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో పేదలు నివాసానికి యోగ్యంగా ఉండే వంద శాతం పూర్తయిన 3,424 ఇళ్లను గృహ ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధం చేస్తున్నాం. ఆ దిశగా వేగంగా కసరత్తు చేస్తున్నాం. జూన ఆఖరులోగా వంద శాతం ఇళ్లు పేదలకు అప్పగించేలా లక్ష్యం పెట్టుకున్నాం.

Updated Date - Feb 18 , 2026 | 12:17 AM