Share News

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:47 PM

గోస్పాడు పోలీస్‌ స్టేషన పరిధిలో ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల సబ్‌ డివిజన ఏఎస్పీ సుస్మిత తెలిపారు.

   ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
దొంగల అరెస్టును చూపి వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ

రూ. 27 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

నంద్యాల క్రైం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గోస్పాడు పోలీస్‌ స్టేషన పరిధిలో ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల సబ్‌ డివిజన ఏఎస్పీ సుస్మిత తెలిపారు. పట్టణంలోని ఎస్పీ బంగ్లాలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. 2025 జూలై 3న గోస్పాడు మండలంలోని ఎస్‌. కూలూరు గ్రామంలో గోపవరం సత్యనారాయణ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాద మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ సునీల్‌ షెరాన ఆదేశాల మేరకు ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో నంద్యాల రూరల్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డి, గోస్పాడు ఎస్‌ఐ పి సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగించింది. ఈ క్రమంలో ఆగస్టు 23న గోస్పాడు మండలంలోని సాంబవరం మెట్ట వద్ద చాబోలు మదార్‌సా వెంచర్‌ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణలో గోస్పాడు పరిధిలోనే కాకుండా జిల్లెల్ల, లింగాల, చాబోలు ప్రాంతాలతో పాటు కడప జిల్లా దిగువపల్లి లోనూ చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందని ఆమె తెలిపారు.

రూ.27 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

నిందితుల నుంచి 173.540 గ్రాముల బంగారు ఆభరణాలు(17.354 తులాలు), సుమారు 20 తులాల వెండి ఆభరణాలు, మొత్తం సుమారు రూ.27 లక్షల విలువైన సొత్తును, చోరీలకు ఉపయోగించిన మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత వెల్లడించారు. అరెస్ట్‌ అయిన వారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామానికి చెందిన నాగలూరు ఆదినారాయణ, నాగలూరు యేసేబు అలియాస్‌ తేజ, నాగలూరు శివ అలియాస్‌ శివకుమార్‌గా గుర్తించినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిపై గోస్పాడు, రేవనూరు, నంద్యాల తాలుకా పోలీస్‌ స్టేషన్లతో పాటు కడప జిల్లా వల్లూరు పోలీస్‌ స్టేషనలో పలు కేసులు నమోదైనట్లు ఆమె వివరించారు.

పోలీసు బృందానికి అభినందనలు

నిందితుల అరెస్టులో గోస్పాడు ఎస్‌ఐ పి. సుధాకర్‌ రెడ్డితో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ కేసీ చెన్నయ్య, కానిస్టేబుళ్లు జిలానీ బాషా, నాగేంద్రగౌడ్‌, డి. అశోక్‌, మధు సుధాకర్‌, శేఖర్‌ రెడ్డి, డి. హుస్సేనయ్య, హోంగార్డు కంబగిరి రాముడు కీలకంగా వ్యవహరించారని ఏఎస్పీ తెలిపారు. బృందం పనితీరును జిఎస్పీ అభినందిచినట్లు పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:47 PM