అంగన్‌వాడీల అరెస్టు దుర్మార్గం
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:35 PM
అంగనవాడీల అక్రమ అరెస్టులు దుర్మార్గమని యూనియన నాయకులు అన్నారు.
ఆదోనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో
ఆదోని, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అంగనవాడీల అక్రమ అరెస్టులు దుర్మార్గమని యూనియన నాయకులు అన్నారు. విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఆదోని పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకులు, సీఐటీయూ కార్యకర్తలు స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీమా సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని యూనియన నాయకులు మండిపడ్డారు. అనంతరం టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటమ్మ, సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు పి.ఎస్.గోపాల్, జె.రామాంజనేయులు, నాయకులు రిజ్వానా, సరోజమ్మ, తిప్పన్న, వీరారెడ్డి, లలిత, కరుణ, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.
దేవనకొండ : అంగనవాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్, అంగనవాడీ వర్కర్స్ యూనియన కార్యదర్శి జ్యోతిలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగనవాడీలను అక్రమంగా అరెస్టు చేస్తుందంటూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేశారు. 42 రోజులుగా నిరసన చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా అంగనవాడీలను గుర్తించి, అన్ని బెనపిట్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వెంకటలక్ష్మి, మంగమ్మ, భార్గవి, తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు రూరల్: చలో విజయవాడలో అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ నాయకులను అక్రమ అరెస్టు చేయడం తగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణస్వామి అన్నారు. మం గళవారం ఆలూరులోని అంబేడ్కర్ సర్కిల్ ముందు ధర్నా చేపట్టారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు విశాలక్ష్మి, జయశ్రీ, ప్రభా వతి, రసూల్‌బీ, షాకీర్, కృష్ణ, వెంకటేశ్వర్లు, గోవర్ధన్ పాల్గొన్నారు.