Share News

ఆర్గాన్‌ గ్యాస్‌ వల్లే పేలుడు!

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:04 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో ల్యాడిల్‌ పేలి 8 మంది దుర్మరణం పాలవడానికి ‘ఆర్గాన్‌ గ్యాస్‌’ కారణమని ఫ్యాక్టరీస్‌ విభాగం ప్రాథమిక నివేదిక సమర్పించింది.

ఆర్గాన్‌ గ్యాస్‌ వల్లే పేలుడు!

  • ఫ్యాక్టరీస్‌ విభాగం ప్రాథమిక నివేదిక

  • బ్లో చేసినప్పుడు పైకి వెళ్లాల్సిన గ్యాస్‌ హాట్‌ మెటల్‌ కింద చిక్కుకుని రసాయన చర్య

  • దేశంలో ఎక్కడా ఇలా జరిగిన దాఖలాల్లేవ్‌

విశాఖపట్నం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో ల్యాడిల్‌ పేలి 8 మంది దుర్మరణం పాలవడానికి ‘ఆర్గాన్‌ గ్యాస్‌’ కారణమని ఫ్యాక్టరీస్‌ విభాగం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్లాంటులో ప్రమాదం తర్వాత సోమవారం రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం ఫ్యాక్టరీస్‌ విభాగం అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. అదే రోజు రాత్రి 11గంటలకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ -1లోని కంటిన్యువస్‌ కాస్టింగ్‌ డిపార్టుమెంట్‌లో మిషన్‌-2 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. హాట్‌ మెటల్‌ను ల్యాడిల్‌ ద్వారా తీసుకువచ్చి కాస్టింగ్‌ వైపు తిప్పి సెంటరింగ్‌ చేస్తున్నప్పుడు స్లైడ్‌ గేటు తెరిచే ముందు ఆకస్మికంగా ల్యాడిల్‌లో హాట్‌మెటల్‌ పేలిందని, దాంతో మెషిన్‌-3 వద్ద ఉన్న ఆపరేటర్లు, వర్కర్లు ప్రమాదంలో చిక్కుకున్నారని వివరించారు. ఓవర్‌హెడ్‌ క్రేన్‌ కూడా ఆ మంటల్లో కాలిపోయిందన్నారు. ‘సడన్‌ రిలీజ్‌ ఆఫ్‌ అన్‌ట్రాప్డ్‌ గ్యాసెస్‌ ఇన్‌ ది లిక్విడ్‌ స్టీల్‌’ ఈ దుర్ఘటనకు కారణమని వెల్లడించారు.


ఏమిటీ అన్‌ట్రాప్డ్‌ గ్యాసెస్‌..?

స్టీల్‌ తయారీ ప్రాసెస్‌లో భాగంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నుంచి హాట్‌మెటల్‌ను ల్యాడిల్‌లో ఎస్‌ఎంఎస్‌-1కు తీసుకువచ్చే ముందు ఆక్సిజన్‌ను బ్లో చేస్తారు. ఆ తర్వాత ఆర్గాన్‌ గ్యాస్‌తో రిన్సింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియలో అల్యూమినియం, ఫెర్రోఅల్లాయిస్‌ వంటి లోహాలు తగిన మోతాదులో కలుపుతారు. అనంతరం ల్యాడిల్‌ను పక్కకు వంచి అందులో హాట్‌మెటల్‌ గడ్డ కట్టక ముందే అదే వేడితో కాస్టింగ్‌ చేస్తారు. అయితే సోమవారం కాస్టింగ్‌ చేయడానికి స్లైడ్‌ గేటు తెరిచే ప్రయత్నం చేస్తుండగా ల్యాడిల్‌లోని హాట్‌మెటల్‌ పేలింది. ఆర్గాన్‌ గ్యాస్‌ బ్లో చేసినప్పుడు ప్రాసెస్‌లో భాగంగా అది పైకి వెళ్లిపోవాలి. కానీ గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఆ గ్యాస్‌ ల్యాడిల్‌లో హాట్‌మెటల్‌ కింద చిక్కుకుపోయి ఊహించని విధంగా రసాయన ప్రక్రియ జరిగి పేలుడు సంభవించింది. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని ఉక్కు వర్గాలు చెబుతున్నాయి. కాగా, రిన్సింగ్‌ ప్రక్రియలో భాగంగా హాట్‌మెటల్‌ను స్టీల్‌గా మార్చడానికి అల్యూమినియం, ఫెర్రోఅల్లాయిస్‌ కలుపుతారు. గతంలో నాల్కో కంపెనీ అల్యూమినియం వాడేవారమని, ప్రస్తుతం సాధారణ అల్యూమినియం రోల్‌ ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. అలాగే నాసిరకం ఫెర్రోఅల్లాయిస్‌ కూడా ప్రమాదానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. కాగా, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ మంగళవారం మాట్లాడుతూ... ఆర్గాన్‌ గ్యాస్‌ వల్లే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్‌ విభాగం చెప్పిందన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:06 AM