ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాశ్ ఇకలేరు
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:26 AM
విశ్రాంత ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ప్రకాశ్(77) ఇక లేరు. కొన్నాళ్లుగా హృదయ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున..
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశాఖలో తుదిశ్వాస
శోకసంద్రంలో ఆంధ్ర, తెలంగాణ క్రైస్తవ సమాజం
విజయవాడ (గుణదల), జూన్ 7(ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ప్రకాశ్(77) ఇక లేరు. కొన్నాళ్లుగా హృదయ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1949 జనవరి 29న నిజామాబాద్ జిల్లాలోని జాడి జమాల్‌పూర్‌లో అంతయ్య, అన్నమ్మ దంపతులకు జన్మించిన మల్లవరపు ప్రకాశ్ 1979 అక్టోబరు 10న గురువు (ఫాదర్)గా పట్టాభిషిక్తులయ్యారు. 1988 జూలై 22న బిష్‌పగా బాధ్యతలు స్వీకరించారు. 1998 నుంచి 2002 వరకు కడప బిష్‌పగా ఆధ్యాత్మిక సేవలందించారు. విజయవాడ కేథలిక్ డయోసి్‌సలో 2002-2012 వరకు డాక్టర్ మల్లవరపు ప్రకాశ్ బిషప్ (పీఠాధిపతి)గా సేవలందించారు. 2012-2024 వరకు విశాఖపట్నం ఆర్చ్ బిష్‌పగా కొనసాగారు. ఆర్చ్ బిషప్ ప్రకాశ్ మరణవార్త తెలిసి తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన సేవలు చిరస్మరణీయమని ఆంధ్రా, తెలంగాణ ఆర్చ్ బిష్‌పలు, విజయవాడ కతోలిక పీఠం బిషప్ డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు పేర్కొన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల ఆంతోని, ప్రస్తుత విశాఖపట్నం అగ్రపీఠం ఆర్చ్ బిషప్ ఉడుముల బాల.. నివాళులర్పించారు. మల్లవరపు ప్రకాశ్ పార్థివదేహాన్ని విశాఖపట్నంలో ప్రజల దర్శనార్థం ఉంచారు. అంత్యక్రియల వివరాలను ఇంకా నిర్ణయించలేదని విజయవాడ బిషప్ డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు.