Share News

లక్షన్నర కోట్లతో ఆర్సెలార్‌ ఉక్కు!

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:44 AM

రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటు.. ‘ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ ఉక్కు కర్మాగారానికి...

లక్షన్నర కోట్లతో ఆర్సెలార్‌ ఉక్కు!

  • అనకాపల్లి జిల్లాలో నేడు సీఎం శంకుస్థాపన

  • హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

  • రెండు దశల్లో ఉక్కు కర్మాగార నిర్మాణం

  • 1.25 లక్షల మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు

  • 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభం!

  • 2033కి పనులు పూర్తిచేయాలని లక్ష్యం

అనకాపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటు.. ‘ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ ఉక్కు కర్మాగారానికి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో దీనిని నిర్మించనున్నారు. సీఎం సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 3.30కు నక్కపల్లి మండలం చందనాడ చేరుకుంటారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు స్థలాన్ని, బ్లూప్రింట్లను పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే సందర్భంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5.40 గంటలకు ఉండవల్లికి పయనమవుతారు.


భూమిపూజ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర మంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కంపెనీలు (ఏఎంఎన్‌ఎస్‌) ఈ భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాయి. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి.. 2033 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా 1.25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచ నా. 2,164 ఎకరాల్లో రెండు దశల్లో దీనిని నిర్మిస్తారు. తొలి దశలో 7.3 మిలియన్‌ టన్నులు, రెండో విడతగా 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు చేపడతారు. ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్‌ పురం లో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలను ఈ ఉక్కు కర్మాగారానికి కేటాయించింది.


పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర: కలిశెట్టి

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ఉత్తుత్తి ఆంధ్రగా మారి విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర.. నేడు చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని టీడీపీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తికాక ముందే ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే జూన్‌కల్లా ప్రారంభమవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్లు వంటివని తెలిపారు. జగన్‌ హయాంలో ఈ ప్రాంత వనరులను దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేని మాజీ సీఎం.. పరిశ్రమలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వ్యక్తులను ప్రజలు సామాజికంగా బహిష్కరించాలని పిలుపిచ్చారు.

Updated Date - Mar 23 , 2026 | 03:44 AM