అరసవల్లిలో ఆదిత్యుని వైభవం
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:30 AM
ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) పర్వదినం ఆదివారం నాడే రావడంతో..
శ్రీకాకుళం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) పర్వదినం ఆదివారం నాడే రావడంతో.. ఆదిత్యుని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచే క్యూలైన్లు కిటకిటలాడాయి.శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు వేదమంత్రోచ్ఛారణల నడుమ రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి క్షీరాభిషేకం కనుల పండువగా సాగింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి అర్చకులు మూలవిరాట్‌కు శాస్త్రోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించగా...ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆదివారం స్వామివారి నిజరూప దర్శనం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి వారి అలంకరణ సేవ జరగనుంది.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..
రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.