Share News

అభ్యుదయ సాహిత్యంతోనే ప్రజా చైతన్యం

ABN , Publish Date - May 24 , 2026 | 04:56 AM

అభ్యుదయ సాహిత్యంతోనే ప్రజా చైతన్యం సాధ్యమని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు.

అభ్యుదయ సాహిత్యంతోనే ప్రజా చైతన్యం

  • అరసం నేత పెనుగొండ లక్ష్మీనారాయణ వ్యాఖ్య

  • తిరుపతిలో మొదలైన అరసం మహాసభలు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 23 (ఆంధ్రజ్యోతి): అభ్యుదయ సాహిత్యంతోనే ప్రజా చైతన్యం సాధ్యమని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. అరసం రాష్ట్ర 20వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. అసమానతలు, దోపిడీ లేని సమాజమే లక్ష్యంగా అరసం పని చేస్తుందని పెనుగొండ అన్నారు. పేదరికం, కార్మికుల కష్టాలు, రైతుల సమస్యలను సాహిత్యంలోకి తీసుకువచ్చే ప్రయత్నం రచయితలు, కళాకారులు చేయాలని కోరారు. మూఢ విశ్వాసాలు, ఛాందస భావాలను ప్రశ్నించాలన్నారు. సామాజిక పురోగతికి సాహిత్యం దోహడపడాలని ఆకాంక్షించారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ మాట్లాడుతూ.. సమాజం కుల, మత, లింగ, ప్రాంత పరంగా విచ్ఛినమవుతున్న ఈ సందర్భంలో మనుషులను ఏకం చేసే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందన్నారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కన్వీనర్‌ కాత్యాయనీ విద్మహే మాట్లాడుతూ, మతం మనుషుల మధ్య విబేధాలు సృష్టిస్తున్న ఈ తరుణంలో ప్రజలను సమష్టిగా ఉంచేందుకు సాహితీవేత్తలు కృషి చేయాలన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సాహిత్యవేత్తలు, సాహిత్య సంస్థల మధ్య ఐక్యత అవసరమన్నారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌, రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు పి.సంజీవమ్మ, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సాకం నాగరాజ, విశాలాంధ్ర జనరల్‌ మేనేజర్‌ హరినాథరెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, సాహితీవేత్తలు వి. చెంచయ్య, జీఎస్‌ చలం, కెంగార మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మృతిచెందిన రచయితలకు మహాసభ సంతాపాన్ని ప్రకటించింది.

Updated Date - May 24 , 2026 | 04:56 AM