ప్రపంచ పర్యాటక కేంద్రంగా తూర్పుతీరం
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:44 AM
రాష్ట్రంలో తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు...
పర్యాటక అభివృద్ధితో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు
ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి పర్యాటకంలో ఉపాధి
అరకు ఉత్సవ్ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేశ్
అరకులోయ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. గురువారం ఆయన అల్లూరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణితో కలిసి అరకు ఉత్సవ్-2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు వంటి ప్రాంతాలకు పర్యాటకంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, వాటిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే మూడుచోట్ల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అరకు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అరకును పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అరకు కాఫీ తోటలు పర్యాటకులతో అనుసంధానం చేసి గిరిజన రైతులకు లాభం చేకూర్చేలా కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే పదేళ్లలో ప్రతిఇంట్లో కనీసం ఒకరికి పర్యాటక రంగంలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణను అమలు చేస్తామన్నారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, అరకు ఉత్సవ్‌తో గిరిజన ప్రాంతానికి పర్యాటకంగా మరింత గుర్తింపు వస్తుందన్నారు.