Share News

శరవేగంగా అరకు రైల్వే స్టేషన్‌ పనులు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:47 PM

అరకులోయ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా రూ.14 కోట్లతో ఇక్కడ అధునాతన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.

శరవేగంగా అరకు రైల్వే స్టేషన్‌ పనులు
యండపల్లివలసలో నిర్మాణంలో ఉన్న అరకు నూతన రైల్వే స్టేషన్‌ భవనం

అధునాతన వసతులతో కొత్త స్టేషన్‌ భవన నిర్మాణాలు

డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

హైవే నుంచి స్టేషన్‌ రెండవ వైపునకు కనెక్టివిటీ కోసం భూ సేకరణ

అరకులోయ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): అరకులోయ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా రూ.14 కోట్లతో ఇక్కడ అధునాతన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న అరకు రైల్వే స్టేషన్‌ పక్కనే కొత్త భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్లాట్‌ఫారం షెడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. స్టేషన్‌కు రెండో వైపు జాతీయ రహదారి ఉండడంతో కనెక్టివిటీ కోసం ఎకరంన్నర స్థలం అవసరమని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖ కోరింది. దీంతో స్థల సేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. కాగా ఈ నెల 14న కరకవలస- సిమిలిగుడ మధ్య 9 కిలోమీటర్ల మేర రెండవ ట్రాకును రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పర్యవేక్షించి అందుబాటులోకి తేనున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య ట్రాక్‌ ఫిట్‌నెస్‌ పనులను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు కేకే లైన్‌లో పాసింజర్‌ రాకపోకలను నిలిపి వేశారు. ఈ నెల 15 తర్వాత పాసింజరు రైలు రాకపోకలు జరిగే అవకాశాలున్నాయి.

Updated Date - Mar 09 , 2026 | 11:47 PM