ఆక్వా రంగాన్ని తక్షణమే ఆదుకోండి : రైతు సంఘం
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:41 AM
రొయ్యలకు సోకుతున్న తెల్లపేగు (వైట్ గట్) కారణంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా...
విజయవాడ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రొయ్యలకు సోకుతున్న తెల్లపేగు (వైట్ గట్) కారణంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా...వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆరోపించారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక ప్రకటన చేస్తూ రొయ్యలు చనిపోతున్న విషయం శనివారమే తనకు తెలిసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు ప్రకటించి హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రొయ్య మేతల ధరలను తగ్గించాలనే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తయారీ కంపెనీలపై తక్షణ చర్యలకు దిగడం ద్వారా కూటమి పాలకులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. మార్కెట్‌లో 100 కౌంట్ కలిగిన రొయ్యలకు కనీసంలో కనీసంగా రూ.300 మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. నకిలీ మందును అరికట్టే చర్యల్లో భాగంగా తక్షణమే ఆక్వా మెడి సిన్ పాలసీని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వైట్ గట్ వైరస్ నివారణకు ప్రభుత్వం ఆధ్వర్యంలో శాస్త్రీయమైన పరిశోధనలు జరిపి తగిన మందులను ఆవిష్కరించాలని, వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సబ్సిడీలను తగ్గించేందుకు తీసుకొచ్చిన పవర్ ఫ్యాక్టర్ జీవో 169ను తక్షణమే రద్దు చేయాలని సూచించారు. ఇకనైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలు మాని, ఆక్వా రైతాంగానికి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.