ప్రైవేటు విద్యుత్ బస్సులకు ససేమిరా
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:06 AM
ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు వద్దని, ఆర్టీసీ ..
సొంతగా కొనాలి.. ఖాళీలు భర్తీ చేయాలి
ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల డిమాండ్
అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు వద్దని, ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించరాదని కూడా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ సిబ్బందితోనే జరగాలన్నారు. అదేసమయంలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. అయితే, ఈ విషయంపై ఆర్టీసీ యాజమాన్యం తరఫున చర్చలకు హాజరైన అధికారులు మాట్లాడుతూ.. ‘‘బస్సులు ఎవరు నడిపినా అజమాయిషీ మాత్రం ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనే ఉంటుంది. ప్రజా రవాణా సంస్థను ప్రైవేటు పరం చేస్తారనేది అపోహ మాత్రమే. మీ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.’’ అని పేర్కొన్నారు. జేఏసీ తరపున పలిశెట్టి దామోదర్‌రావు, వై. శ్రీనివాస రావు, రమణారెడ్డి, నరసయ్య, సుందరయ్య, శేషగిరి, జిలానీ అధికారులతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు 30 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. యాజమాన్యం పరిధిలో ఉన్న వాటిని పరిశీలించి సాధ్యమైనవి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈడీలు హామీ ఇచ్చారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, ఇతర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. రెండున్నర గంటల పాటు జరిగిన చర్చలపై జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన మేరకు నిరసనలు కొనసాగుతాయని జేఏసీ కన్వీనర్లు పలిశెట్టి దామోదర్‌రావు, వై. శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో నల్ల రిబ్బన్లతో రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల్లో నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. పది రోజుల్లోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.