ఆర్టీసీలోనూ అల్లాడించారు!
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:46 AM
ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఏపీఎస్ ఆర్టీసీలోనూ అల్లాడించినట్లు చర్చ జరుగుతోంది.
అధికారులతో ఆ ఉన్నతాధికారి ముడుపుల బేరం
కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి మారాక
జీతాల అంతరం రికవరీకి ఆర్థిక శాఖ నోటీసులు
దానిని ఆపాలంటూ ఆ ఉన్నతాధికారి వద్దకు..
‘అయితే నాకేంటి’.. అంటూ నేరుగానే బేరాలు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆర్టీసీలో తీవ్ర చర్చ
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఏపీఎస్ ఆర్టీసీలోనూ అల్లాడించినట్లు చర్చ జరుగుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ’అల్లాడిస్తున్నారు’ వార్తా కథనం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్టీసీ వర్గాలను అనుసరించి ఆ వివరాలివీ..2020వరకూ కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీలో అధికారుల వేతనాలు ప్రభుత్వంలోని ఐఏఎస్‌ల కన్నా ఎక్కువగా ఉండేవి. ఆర్టీసీలో ఈడీలు తీసుకునే జీతభత్యాలు సీనియర్ ఐఏఎస్ జీతం కంటే ఎక్కువగా.. డిపో మేనేజర్ జీతం ఆర్డీవో/డీఎస్పీ కన్నా అధికంగా ఉండేది. అయితే 2020 జనవరి నుంచి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమయ్యారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (పీటీడీ) పేరుతో ఆర్టీసీలోని యాభై వేల మందిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసింది. అయితే 2022 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగింది. ఆ సమయానికి ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలో విలీనమైన అధికారుల జీతాలు ఎక్కువగా, సిబ్బంది వేతనాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమ వేతనాలు పెంచాలంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పలు దఫాల చర్చల తర్వాత 2022 సెప్టెంబరులో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఆర్టీసీ నుంచి విలీనమైన సిబ్బందికి చెల్లించేలా అంగీకారం కుదిరింది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బందికి రూ.నాలుగైదు వేల చొప్పున జీతాలు పెరిగాయి. అయితే 2022 జనవరి నుంచి అమలు చేస్తూ, తొమ్మిది నెలల బకాయిలు సైతం ప్రభుత్వం చెల్లించింది.
ఇదే సమయంలో అధికారుల జీతాలు కార్పొరేషన్‌లో ఉన్నప్పటితో పోల్చితే ప్రభుత్వంలోకి మారాక సహజంగానే తగ్గాయి. ఉదాహరణకు ఆర్టీసీలో రీజినల్ మేనేజర్‌గా ఉన్న అధికారి ప్రభుత్వంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హోదాలో.. ఈడీగా ఉన్న అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో.. డిపో మేనేజర్ అయితే ఆర్డీవో లేదా డీఎస్పీ సమాన హోదాలో విలీనం అయ్యారు. కార్పొరేషన్‌లో జీతాలు అప్పటికే అధికారులకు రూ. లక్ష ఉంటే విలీనం తర్వాత 80వేలకు, లక్షన్నర ఉంటే 1.20వేలకు తగ్గింది. అయినా సరే కార్పొరేషన్‌లో ఉన్నట్లే ఎక్కువ జీతాలు డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ గుర్తించి ఎక్కువగా డ్రా చేసిన సొమ్ము తిరిగి చెల్లించాలంటూ ఈడీల నుంచి డీఎంల వరకూ నోటీసులు పంపింది.
రికవరీ ఆపాలంటూ..
ఉలిక్కిపడ్డ ఆర్టీసీ అధికారులు తమను రక్షించాలంటూ సదరు అధికారి వద్దకు వెళ్లారు. పాత సొమ్ము రికవరీ చేయొద్దని బతిమాలుకున్నారు. ‘మీకు సాయం చేస్తే నాకేంటి.?’ అని ఆ అధికారి బేరం పెట్టినట్లు తెలిసింది. రికవరీ చేస్తే ఒక్కొక్కరు పది లక్షలు, పాతిక లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి. దాని కంటే, ఆ అధికారికే ఎంతో కొంత ముట్టచెబితే బయటపడిపోతామని ఆర్టీసీ అధికారులు చర్చించుకున్నారు. ఆయన ఏదో క్లాజు చూపించి బకాయిలు వసూలు చేయకుండా ఆపేస్తారని మాట్లాడుకున్నారు. ఈ మేరకు ఆయనను ఒప్పించేందుకు ఇద్దరు రిటైర్డ్ ఈడీలను చర్చలకు పంపి...అధికంగా విత్ డ్రా చేసిన సొమ్ములో ఎంత శాతం అనధికారికంగా తిరిగి చెల్లించాలనే కసరత్తు వారం రోజులుగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం ఆర్టీసీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.