ప్రైవేటు ఈ-బస్ వద్దు
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:07 AM
ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించరాదని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
కేంద్ర ప్రోత్సాహంతో ఆర్టీసీనే కొనుగోలు చేయాలి
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్
అమరావతి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించరాదని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అలాంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించింది. ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్ తదితర ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యాయి. అనంతరం జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్‌రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విద్యుత్ బస్సులు ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఆర్టీసీ ద్వారానే వాటిని కొనుగోలు చేసి సంస్థ సిబ్బందితో నడిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు సరిపడా తక్షణమే 4 వేల కొత్త బస్సులు కొనుగోలు చేసి 10 వేల మంది సిబ్బందిని నియమించాలని కోరారు. 12వ పీఆర్‌సీ ఏర్పాటు, 11వ పీఆర్‌సీ బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై చర్చించినట్లు వెల్లడించారు. జేఏసీ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈ నెల 11న ఆర్టీసీ ఎండీకి అందజేస్తామని తెలిపారు. 28న విజయవాడలో జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశం ఉంటుందని వివరించారు.