ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీని ప్రైవేటీకరించొద్దు
ABN , Publish Date - May 23 , 2026 | 05:09 AM
ఎలక్ర్టిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లొద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘా ల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వినతి
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లొద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘా ల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబుతో సమావేశమయ్యారు. అనంతరం సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఉన్న ఉద్యోగులకే కాదు, భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకూడదని కన్నబాబుకు విజ్ఞప్తి చేశామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు చెప్పారు. ప్రైవేటీకరణ జరగదనే స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రాకపోతే ఆందోళనలు పెరుగుతాయన్నారు. ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ప్రైవేటీకరణ ముప్పుపై కార్మికుల్లో ఉన్న ఆందోళనను ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.