Share News

సురక్షిత ప్రయాణం..డ్రైవర్‌కు ఏదీ?

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:18 AM

ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్‌ చేతిలో ఉంటాయి. మరి డ్రైవర్‌ ప్రాణాలకే ముప్పు ఏర్పడితే?.. సురక్షిత ప్రయాణానికి భరోసా ఇస్తోన్న ఏపీఎ్‌సఆర్టీసీలో ఇప్పుడు డ్రైవర్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది...

సురక్షిత ప్రయాణం..డ్రైవర్‌కు ఏదీ?

  • స్టీరింగ్‌పై వాలిపోతున్న రథ సారథులు

  • ఏపీఎ్‌సఆర్టీసీ డ్రైవర్లలో పెరుగుతున్న గుండెపోట్లు

  • గత మూడేళ్లలో 910 మంది మృతి

  • డ్రైవర్ల ప్రాణాలు కాపాడుకోకుంటే ఆర్టీసీకే నష్టం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్‌ చేతిలో ఉంటాయి. మరి డ్రైవర్‌ ప్రాణాలకే ముప్పు ఏర్పడితే?.. సురక్షిత ప్రయాణానికి భరోసా ఇస్తోన్న ఏపీఎ్‌సఆర్టీసీలో ఇప్పుడు డ్రైవర్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. బస్సు నడుపుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో డ్రైవర్లు స్టీరింగ్‌పై వాలిపోతున్నారు. ప్రయాణికుల్ని భద్రంగా గమ్యానికి చేర్చాల్సిన రథసారథులే మార్గ మధ్యలో లోకాన్ని వీడి వెళ్లి పోతున్నారు. ప్రయాణికుల వెన్నులో వణుకు, డ్రైవర్ల కుటుంబాల్లో కన్నీరు పెట్టిస్తున్న ఈ సమస్య ఆర్టీసీకి పెను సవాలుగా మారింది. ఏటా 250 నుంచి 350 మంది చొప్పున గత మూడేళ్లలో 910 మంది డ్రైవర్లు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

డ్రైవర్లకు వైద్య పరీక్షలు ఏవీ?

ప్రతి రోజూ లక్షల ప్రయాణికుల్ని గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్ల ఆరోగ్యం.. ఆ ఉద్యోగి సంక్షేమం మాత్రమే కాదు.. ప్రజల భద్రతకు సంబంధించినది. ప్రైవేటుతో పోలిస్తే ఆర్టీసీ కొంతమేర సురక్షితమేనని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. డ్రైవర్లు స్టీరింగ్‌పై వాలిపోయి ప్రాణాలు కోల్పోతున్నా ప్రయాణికుల్ని మాత్రం రక్షిస్తూనే ఉన్నారు. ప్రతి సారీ, ప్రతి డ్రైవర్‌ ఇలా కాపాడటం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రవాణా, కార్మిక భద్రతా నిబంధనల ప్రకారం వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లకు నిర్దిష్ట వ్యవధిలో వైద్య పరీక్షలు చేయాలి. కంటి చూపు, వినికిడి, శారీరక, మానసిక సమస్యలతోపాటు గుండె ఆరోగ్యాన్ని పరీక్షించి వైద్యుల నివేదిక ప్రకారం మందులు, ఆహార అలవాట్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీఎ్‌సఆర్టీసీ రికార్డుల ప్రకారం 45 ఏళ్లలోపు వయసున్న డ్రైవర్లకు ప్రతి రెండేళ్లకు, అది దాటిన వారికి ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా రాత్రుల్లో వాహనం నడిపేవారు, దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నట్లు వెల్లడవుతోంది.


పని ఒత్తిడి.. నిద్రలేమి కారణాలు

డ్రైవర్ల గుండెపోటు మరణాలకు ప్రధానంగా పని ఒత్తిడి, పని వేళలు, నిద్రలేమి, ఆహార అలవాట్లు కారణాలుగా చెబుతున్నారు. ఇందులో మొదటి రెండూ తగ్గాలంటే డ్రైవర్ల నియామకాలను ఆర్టీసీ చేపట్టాలి. నిద్రలేమి, ఆహార అలవాట్లు పూర్తిగా డ్రైవర్ల చేతిలోనే ఉన్నాయి. ఏటా వందల మంది డ్రైవర్లు ఎందుకు గుండెపోటుతో మరణిస్తున్నారంటే.. ఆ నాలుగింటినీ జయించడం అటు ఆర్టీసీ యాజమాన్యానికి, ఇటు డ్రైవర్లకు కష్ట సాధ్యంగా మారింది. ఏ సంస్థ అయినా మనుగడ సాగించాలంటే ఆదాయమే అన్నింటికన్నా ముఖ్యం. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తున్న ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి. ఆర్టీసీ డ్రైవర్లకు ప్రైవేటు రవాణాతో పోలిస్తే ఎక్కువ జీతాలు ఉన్నందున పని గంటలు కూడా పెంచాలని, అలా చేయకపోతే సంస్థ మనుగడ కష్టమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘జీతాలు ఎక్కువ తీసుకొంటూ తక్కువ సమయం పనిచేస్తే సంస్థ మనుగడ కోసం ప్రయాణికులపై చార్జీల భారం వెయ్యాలి. ప్రైవేటు పోటీతోపాటు, ద్విచక్ర వాహనాలు వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణ చార్జీలు పెంచితే ఆక్యుపెన్సీ తగ్గిపోయి ఆర్టీసీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది’ అని ఒక ఉన్నతాధికారి వివరించారు. ‘ఆర్టీసీ బస్సు నడిపే డ్రైవరు.. ఆదాయం తీసుకొచ్చే కండక్టరు.. బస్సు ఆరోగ్యాన్ని పరిరక్షించే మెకానిక్‌.. రవాణ సంస్థ మనుగడలో ముందుంటారు. వారే పని ఒత్తిడితో ప్రాణాలు కోల్పోతుంటే సంస్థ బాగుంటుందా? ఆ కార్మికుడి కుటుంబం బాగుంటుందా? పెద్ద పెద్ద బస్టాండ్లలోనైనా రెస్ట్‌ రూమ్‌లు బాగున్నాయా? పది పన్నెండు గంటలపాటు డ్యూటీ చేస్తున్న కార్మికుడిపై మరింత పని భారం మోపితే సమస్యకు పరిష్కారం లభించదు. తగినంత పని, తగినంత విశ్రాంతి ఇస్తే డ్రైవర్‌ ఆరోగ్యంతోపాటు ఆర్టీసీ మనుగడ కూడా బాగుంటుంది. కొత్త బస్సులు కొనుగోలు చేసి రిక్రూట్మెంట్లు చేపడితే ఆక్యుపెన్సీ పెరిగి సంస్థ ఇంకా బాగుంటుంది’ అని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.


కాలం చెల్లిన బస్సులు.. వయసు మళ్లిన డ్రైవర్లు

ఆర్టీసీ ప్రధాన నినాదమైన సురక్షిత ప్రయాణానికి.. బస్సు కండీషన్‌, డ్రైవర్‌ ఆరోగ్యం కీలకం. సంస్థలో ఇప్పుడు ఈ రెండూ బాగాలేవు. కాలం చెల్లిన బస్సులు సగానికి పైగా ఉంటే వయసు మళ్లిన డ్రైవర్లు అంతకన్నా ఎక్కువగా ఉన్నారు. ఆర్టీసీలో సొంత బస్సులు 8 వేలు ఉండగా.. వాటిలో 5 వేల బస్సులు కాలం చెల్లినవే. డ్రైవర్ల వయసు సరాసరి 50 ఏళ్లు దాటింది. ప్రజారవాణా మార్గదర్శకాల మేరకు సగటు వయసు 37-39 ఏళ్ల మధ్య ఉండాలి. 2011 తర్వాత డ్రైవర్ల రిక్రూట్మెంట్లు లేవు. ఈ ఏడాది 2600మంది పదవీ విరమణలో ఉండగా, 2030 నాటికి 7 వేల మందికిపైగా పదవీ విరమణ చేయనున్నారు. సొంత బస్సులు 8,250 ఉండగా అందులో 15 లక్షల కిలోమీటర్లు దాటినవి 2,900 ఉన్నాయి. కేంద్ర రవాణా శాఖ మార్గదర్శకాల మేరకు 15 లక్షల కిలోమీటర్ల లోపే రవాణా వాహనాలను తిప్పడం ఆపేయాలి. ఆర్టీసీలో 12లక్షల కిలోమీటర్లు దాటితే పక్కన పెట్టేసే పద్ధతి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడున్న బస్సుల్లో 5 వేలకు పైగా 12 లక్షల కిలోమీటర్లు దాటి తిరిగినవే. ఓ అసోసియేషన్‌ ప్రతినిధి మాట్లాడుతూ ‘వెహికల్‌ యుటిలైజేషన్‌ ప్రకారం గతంలో 350 కిలోమీటర్లు తిరిగితే రెండు డ్యూటీల కింద లెక్క. ఇప్పుడు 500కు పెంచారు. కాణిపాకం నుంచి తిరుపతికి గతంలో నాలుగు ట్రిప్పులు తిరిగేవి.. ఇప్పుడు ఐదు ట్రిప్పులు తిరగమంటున్నారు. అడిగితే అప్పుడు రోడ్లు బాగలేవు.. ఇప్పుడు బాగున్నాయి కదా అంటున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7వరకూ తిప్పే డ్రైవరుకు మరో గంట పెంచితే రోజుకు 14 గంటల డ్యూటీ చేసినట్లు.. ఇలా పని భారం పెరిగితే రిటైర్మెంట్‌ వరకూ అయినా బతుకుతామా?’ అని వాపోయారు.


మానసిక ఒత్తిడి ప్రధాన సమస్య: ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌రావు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పనిగంటలతోపాటు మానసిక ఒత్తిడి కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ‘దూర ప్రాంత డ్రైవరుకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు, పల్లె వెలుగుల్లో స్ర్తీ శక్తి రద్దీకి అనుగుణంగా బస్సుల కండీషన్‌ లేదు. కొత్త బస్సులు కొనకుండా, డ్రైవర్ల సంఖ్య పెంచకుండా ఉన్న బస్సులతోనే నడిపించడం. మైలేజీ రాలేదని అడగటం. బస్సుకు చిన్న డ్యామేజీ జరిగినా డ్రైవర్‌ జీతం నుంచి కట్‌ చేయడం’ కారణాలుగా పేర్కొన్నారు.

ఆహార అలవాట్లే: అధికారులు

ఉన్నతాధికారులు మాత్రం ‘ప్రజలకు ఆర్టీసీ 24గంటలు, 365రోజులు సేవలు అందించాల్సిందే. ఇది తెలిసే డ్రైవర్లు ఉద్యోగంలో చేరారు కదా. పని ఒత్తిడి అందరికీ ఉంటుంది. చాలామంది అదనపు డ్యూటీలు చేసి తగిన వేతనం తీసుకొంటున్నారు. ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఆహార అలవాట్లు. దూర ప్రాంత బస్సు డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ నాణ్యత లేని ఆహారం తింటుంటారు. సమయ పాలన కూడా కుదరకపోవచ్చు. యాజమాన్యం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయుస్తోంది. డ్రైవర్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి’ అని చెబుతున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 03:18 AM