’స్త్రీ శక్తి’ సేవల్లో రాజీపడొద్దు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:56 AM
ఆర్టీసీ బస్టాండ్లలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం సరిగా లేదని ముఖ్యమంత్రి తరచూ నిర్వహించే ఐవీఆర్‌ఎస్ సమీక్షలో తేలింది..
బస్టాండ్లలో మరుగుదొడ్లు శుభ్రపడాలి: ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ
రాష్ట్రానికి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయ్
సమన్వయంతో చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా, వసతులు: కృష్ణబాబు
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్టాండ్లలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం సరిగా లేదని ముఖ్యమంత్రి తరచూ నిర్వహించే ఐవీఆర్‌ఎస్ సమీక్షలో తేలింది.. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ఈ సమస్యపై సమీక్షించి తక్షణమే పరిష్కరించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం ’స్త్రీ శక్తి’ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు మెరుగ్గా అందించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉందని చెప్పారు. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, రవివర్మ, అప్పలరాజు, ప్రాంతీయ మేనేజర్లతో సంస్థ స్థితిగతులు, ప్రయాణ సేవలపై ఆయన సమీక్ష జరిపారు. స్త్రీ శక్తి అమల్లోకి వచ్చాక ఆర్టీసీ ఆక్యుపెన్సీ 90శాతానికి పెరగడంపై కృష్ణబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని, ‘పీఎం ఈ-బస్ పథకంలో భాగంగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని.. మరో 1,450 విద్యుత్, సీఎన్‌జీ బస్సులను రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు వెల్లడించారు. వాటి సజావు నిర్వహణకు చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా వనరులు, మౌలిక వసతులన్నింటినీ సమన్వయంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి కార్గో సేవలతో పాటు బస్టాండ్లలోని స్థలాలను వాణిజ్యపరంగా వినియోగంలోకి తెచ్చుకోవడానికి గల అవకాశాలపై కసరత్తు చేయాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలపైనా చర్చించారు.