Share News

APPSC: గ్రూప్‌-1 తర్వాతే గ్రూప్‌-2 ఫలితాలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:07 AM

గ్రూప్‌-1 ఫలితాల తర్వాతే గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

APPSC: గ్రూప్‌-1 తర్వాతే గ్రూప్‌-2 ఫలితాలు

  • సంక్రాంతిలోగా గ్రూప్‌-1 రిజల్ట్స్‌

  • త్వరగా ఇవ్వాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌కు గ్రూప్‌-2 అభ్యర్థుల విజ్ఞప్తి

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ఫలితాల తర్వాతే గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్‌-2కు సంబంధించిన కేసులపై పరిష్కారం లభించినా.. గ్రూప్‌-1 తర్వాతే వాటి ఫలితాలు ఇవ్వనుంది. గ్రూప్‌-2 ఫలితాలను త్వరగా విడుదల చేయాలని సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు శుక్రవారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నోటిఫికేషన్‌ జారీచేసి రెండేళ్లు అవుతోందని, ఇప్పటికీ ఫలితాలు రాకపోవడం వల్ల తమ విలువైన సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నామని, ప్రస్తుతం కేసులన్నీ తొలగిపోయినందున వెంటనే తుది ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి లోగా గూప్‌-1 ఫలితాలు విడుదల చేస్తామని, గ్రూప్‌-2 ఫలితాల ప్రక్రియ ప్రారంభమైందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ వారితో అన్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-2 అభ్యర్థులకు కొత్తగా అన్‌విల్లింగ్‌ ఆప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ నెలాఖరునాటికి గ్రూప్‌-2 ఫలితాలు విడుదల కావొచ్చని తెలుస్తోంది. గ్రూప్‌-2లో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారిలో చాలా మంది గ్రూప్‌-1లోనూ ఉండే అవకాశం ఉన్నందున.. ఏపీపీఎస్సీ తొలుత గ్రూప్‌-1 ఫలితాలివ్వాలని భావిస్తోంది. మరోవైపు హారిజంటల్‌ రిజర్వేషన్‌పై పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో గ్రూప్‌-1 క్రీడా కోటాలో నలుగురు అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు పిలిచింది. ఈనెల 7న వారికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. అనంతరం గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేస్తారు.

Updated Date - Jan 03 , 2026 | 05:07 AM