Share News

ఎట్టకేలకు గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:12 AM

అర్ధరాత్రి 12 గంటల సమయంలో కమిషన్‌ సభ్యులతో సంతకాలు.. తెల్లవారుజాము 2.47 గంటలకు ప్రక్రియ పూర్తి.. 3 గంటలకు అధికారికంగా ఫలితాల విడుదల.

ఎట్టకేలకు గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

  • ఉద్యోగాలకు 891 మంది ఎంపిక

  • రెండు పోస్టులు రిజర్వ్‌.. మిగిలినవి 12

  • కొన్ని కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థుల కొరత

  • టీచర్‌కు గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆగమేఘాలపై కదలిక

  • ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల ఆరా

  • వెంటనే విడుదల ప్రక్రియ ప్రారంభం

అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి 12 గంటల సమయంలో కమిషన్‌ సభ్యులతో సంతకాలు.. తెల్లవారుజాము 2.47 గంటలకు ప్రక్రియ పూర్తి.. 3 గంటలకు అధికారికంగా ఫలితాల విడుదల. గ్రూప్‌-2 తుది ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసిన తీరిది. 2023 డిసెంబరులో విడుదలైన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రెండేళ్లు దాటిన తర్వాత ఇప్పటికి పూర్తయ్యింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆగమేఘాలపై కదలిక వచ్చింది. ఫలితాల విడుదలలో జాప్యంపై ‘గ్రూప్‌-2పై నత్తనడక’ శీర్షికతో మంగళవారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీశారు. అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోందని గుర్తించిన అధికారులు ఫలితాలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు ఫలితాల విడుదల ప్రక్రియను కమిషన్‌ ప్రారంభించి పూర్తి చేసింది. దీనిపైౖ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 905 పోస్టులకు గాను కోర్టు ఆదేశాలతో రెండు పోస్టులను రిజర్వ్‌ చేశారు. న్యాయశాఖ ఏఎ్‌సవో, ఎక్సైజ్‌ ఎస్‌ఐ పోస్టులు మినహాయించి మిగిలిన వాటికి ఫలితాలు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. కొన్ని కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 891 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. రిజర్వ్‌ చేసిన రెండు కాకుండా మరో 12 పోస్టులు మిగిలిపోయాయి. వాటిని తర్వాత నోటిఫికేషన్లలో క్యారీ ఫార్వార్డ్‌ పోస్టులుగా గుర్తిస్తారు. మున్సిపల్‌ గ్రేడ్‌-3 కమిషనర్‌ పోస్టులకు నలుగురు, సబ్‌రిజిస్ర్టార్‌ పోస్టులకు 16 మంది, డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు 84 మంది, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ పోస్టులకు 28 మంది, సహకార సొసైటీల్లో అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ పోస్టులకు 16 మంది, పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఇద్దరు, ఎక్సైజ్‌ ఎస్‌ఐ పోస్టులకు 150 మంది, సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జీఏడీ) పోస్టులకు 218 మంది, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(లా) పోస్టులకు 11 మంది, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(లెజిస్లేచర్‌) పోస్టులకు 15 మంది, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(ఆర్థిక) పోస్టులకు 29 మంది, సీసీఎల్‌ఏలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 31 మంది, వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 19 మంది, ప్రభుత్వ పరీక్షల విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 19 మంది, ఇతర శాఖల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసి తుది ఫలితాలు విడుదల చేసింది.


హైకోర్టు తుది తీర్పు షరతుతో..

హైకోర్టులో ఉన్న కేసులపై వచ్చే తుది తీర్పునకు అనుగుణంగా ఉండాలనే షరతుతో ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల చేసింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇద్దరు అభ్యర్థులకు క్రీడా కోటా పోస్టులను రిజర్వ్‌ చేసింది. ఆ ఇద్దరు కేసుల్లో గెలిచి ఆ ఉద్యోగాలు సాధిస్తే రోస్టర్‌ ఇలాగే కొనసాగుతుంది. ఒకవేళ వారు కేసుల్లో ఓడిపోతే కొన్ని పోస్టులు మారిపోతాయి. మరోవైపు నోటిఫికేషన్‌లోని రోస్టర్‌పై మళ్లీ దాఖలైన రిట్‌ బుధవారం విచారణకు వచ్చింది. ఈ మూడు కేసులపై వచ్చే తుది తీర్పులకు అనుగుణంగా ఈ పోస్టింగులు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది.

తెల్లవారుజాము వరకు ఉత్కంఠ

2024లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఇలాగే అర్ధరాత్రి తర్వాత విడుదల చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఫలితాల విడుదలపై ముందుగానే అభ్యర్థులకు సమాచారం అందడంతో తెల్లవారుజాము వరకు నిద్రపోకుండా ఉత్కంఠగా ఎదురుచూశారు.

టీచర్లకు గ్రూప్‌-2 కొలువులు

పాఠశాల విద్యాశాఖలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్న మోతుకూరి రవీంద్ర గ్రూప్‌-2 ఫలితాల్లో ఉద్యోగం సాధించారు. అందులోనూ కీలకమైన గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగానికి ఆయన ఎంపికయ్యారు. పోలియోతో చిన్నతనంలోనే దివ్యాంగుడైన రవీంద్ర 2001 డీఎస్సీలో టీచర్‌ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నాగులుప్పాడలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. రెంటచింతలకు చెందిన మరో టీచర్‌ సురేశ్‌కు సబ్‌రిజిస్ర్టార్‌ ఉద్యోగం వచ్చింది. ఇంకా పలు శాఖల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్‌-2 ఉద్యోగాలు సాధించారు.

Updated Date - Jan 29 , 2026 | 04:12 AM