Share News

గ్రూప్‌-1 అక్రమాలపై ‘సిట్‌’

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:31 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసింది.

గ్రూప్‌-1 అక్రమాలపై ‘సిట్‌’

  • సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో ఏర్పాటు

  • తనిఖీలు, ఆధారాల స్వాధీనం, సాక్షుల విచారణ, వాంగ్మూలం నమోదుకు అధికారాలిస్తూ పోలీ్‌సస్టేషన్‌ హోదా

  • పలు అంశాలపై విజయవాడ వెలుపల కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిపుణలతో పరీక్షలకు ఆదేశం

  • జావాబు పత్రాలను సమగ్రంగా పరిశీలించనున్న అధికారులు

  • దర్యాప్తు పూర్తి చేసి మార్చి 16 లోపు హైకోర్టుకు నివేదిక

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇటీవల వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఏపీ సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని నియమించిన ప్రభుత్వం.. దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులకు సంబంధిత ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశించింది. అవసరమైన చోట తనిఖీలు, ఆధారాల స్వాధీనం, సాక్షుల విచారణ, వాంగ్మూలం నమోదుకు అధికారాలిస్తూ పోలీస్‌ స్టేషన్‌ హోదా కల్పించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా దర్యాప్తులో పలు అంశాలపై విజయవాడ వెలుపల ఉన్న ఏదైనా కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీ నిపుణులతో పరీక్షలు చేయాలని సిట్‌కు స్పష్టం చేసింది. గ్రూప్‌ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జవాబు పత్రాలు సక్రమంగా ఉన్నాయా? వాటిని ఎవరైనా ట్యాంపర్‌ చేశారా? జవాబు పత్రాలపై ఉన్న బార్‌ కోడ్లు, ఒరిజనల్‌ ఓఎంఆర్‌ షీట్లు, మూల్యాంకనంలో ఉపయోగించిన ఓఎంఆర్‌ షీట్లపై ఉన్న బార్‌ కోడ్‌లు సరిపోలుతున్నాయా? లేదా అనేది సిట్‌ అధికారులు పరిశీలించనున్నారు. అదే విధంగా ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్ధుల జవాబు పత్రాలను కూడా తనిఖీ చేయనున్నారు.


మెరిట్‌ లిస్ట్‌లో ఆఖరి అభ్యర్ధి కంటే దిగువున ఉన్న 100 మంది జవాబు పత్రాలను పరిశీలించడంతో పాటు.. జవాబు పత్రాల ట్యాంపరింగ్‌కు సంబంధించి మరేదైనా సమాచారం ఉంటే శాస్త్రీయ పద్ధతుల ద్వారా గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసి మార్చి 16వ తేదీ లోగా కోర్టుకు సిట్‌ నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా వైసీపీ ప్రభుత్వంలో భర్తీ చేసిన 169 పోస్టుల మెయిన్‌ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అక్రమాలు జరిగినట్టు తేలింది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం మూల్యాంకనం ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్‌ పరీక్ష అవసరమని భావిస్తున్నట్టు తాజా తీర్పులో పేర్కొంది. ‘అసాధారణ పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీయడానికి అసాధారణమైన దర్యాప్తే సరైన మార్గం, మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరం. అందుకే సిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ బోర్డు అనుమతి లేకుండా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌లోని అవాస రిసార్ట్స్‌కు తరలించింది ఎవరు.. వాటిని 65 రోజుల పాటు అక్కడే ఉంచాలని ఎవరు నిర్ణయించారనే విషయాన్ని సిట్‌ తేల్చి మార్చి 16 లోపు హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది.

Updated Date - Feb 15 , 2026 | 03:33 AM