గ్రూప్-1పై సిట్
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:34 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం
మెయిన్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై తేల్చండి
జవాబు పత్రాలను ట్యాంపర్ చేశారేమో పరిశీలించండి
మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్‌కు ఆదేశం
ఎంపికైన అభ్యర్థులు అప్రాధాన్య పోస్టులకు: ధర్మాసనం
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న సిట్‌ను పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్‌కు అడిషనల్ డీజీ స్థాయి హోదా తగ్గని అధికారి నేతృత్వం వహించాలని స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు వివరాలను మూడు రోజుల్లో రిజిస్ట్రార్(జ్యుడీషియల్)కు సమర్పించాలని ఏజీని ఆదేశించింది. కోర్టు సూచించిన పలు అంశాలపై విజయవాడ వెలుపల ఉన్న ఏదైనా కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో దర్యాప్తు చేయాలని సిట్‌కు స్పష్టం చేసింది. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలంది. ఎంపికైన అభ్యర్థులందరినీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కీలక పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తర్వుల అమలుకు సంబంధించి వారం రోజుల్లో రిజిస్ట్రార్‌కు నివేదిక సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించింది. అనుబంధ వ్యాజ్యాలను పరిష్కరించింది. ప్రధాన అప్పీళ్లపై విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టుదేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
అనుబంధ పిటిషన్ల దాఖలు
‘కోర్టు నియమించిన కమిటీ గుర్తించిన, పరిశీలించిన ఓఎంఆర్ షీట్స్, కంట్రోల్ బండిల్స్‌పై ఉన్న సంతకాలు, చేతిరాతపై ఫోరెన్సిక్ పరిశీలనకు ఆదేశించండి. కోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక అసంపూర్తిగా ఉంది. జవాబుపత్రాలకు జతచేసిన ఓఎంఆర్ షీట్ల పరిశీలన సందర్భంగా కమిటీ గుర్తించిన అంశాలను, పరిశీలించిన వాస్తవాలను నివేదికలో భాగం చేసేలా ఆదేశించండి. విచారణ సందర్భంగా ఏపీపీఎస్సీ కోర్టుకు డాక్యుమెంట్లు, రికార్డులు, ఇతర నివేదికలకు సంబంధించి సర్టిఫైడ్ కాపీలను అందజేసేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరుతూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్లపై వాదనలు ముగియడంతో ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది. బుధవారం వాటిపై నిర్ణయాన్ని ప్రకటించింది.
తీర్పులో ఏముందంటే..
‘రికార్డులు పరిశీలిస్తే ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎ్‌సఆర్ ఆంజనేయులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌లోని అవాస రిసార్ట్స్‌కు తరలించారు. జవాబుపత్రాలను ప్రైవేటు రిసార్ట్స్‌కు తరలించడం, వాటిని 65 రోజుల పాటు అక్కడే ఉంచాలని ఎవరు నిర్ణయించారో నిరూపించే ఏ ఫైలూ ఏపీపీఎస్సీ వద్ద లేదని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. హాయ్‌ల్యాండ్‌లో ఎలాంటి మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ చెబుతోంది. అందుకు విరుద్ధంగా ఒరిజనల్ ఓఎంఆర్ షీట్లపై మార్కులు కేటాయించారని కోర్టు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. విజయవాడలో మూల్యాంకనం నిర్వహించేందుకు ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్స్ తాజాగా ముద్రించారు. ఇటువంటి అంశాలు ఏపీపీఎస్సీ విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఎంపికకాని అభ్యర్థుల ఆరోపణలు అంగీకరించేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. గ్రూప్-1 పోస్టులు రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైనవి.
మూల్యాంకనంలో తమ పాత్ర లేదని, అమాయకులమని ఎంపికైన అభ్యర్థులు చెబుతున్నప్పటికీ.. మూల్యాంకన విధానం, జవాబుపత్రాలు దిద్దే ప్రదేశాలు మారినప్పుడు ఎంపికైనవారి పేర్లు జాబితా నుంచి మాయం కావడం, కీలక సమాచారాన్ని, రికార్డులను సమర్పించడంలో ఏపీపీఎస్సీ విఫలమవడం చూస్తుంటే మూల్యాంకనంలో నిష్పాక్షితపై అనుమానం కలుగుతోంది. ఎంపికైన, ఎంపికకాని అభ్యర్థుల జవాబుపత్రాలను పోల్చి చూడడం ద్వారా ముఖ్యంగా పేపర్ వయస్సు, సిరా వయస్సు, బార్‌కోడ్‌ల సరిపోలిక, కొట్టివేతలు, రాతలో తేడాలు వంటి అంశాలపై ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో విచారణ చేపడితే అనుమానాలు నివృత్తి అవుతాయి. కొంతమంది ఎంపికైన అభ్యర్థుల నిజాయితీ కారణంగా ఇతర అభ్యర్థుల విషయంలో జరిగిన మోసాలను విస్మరించలేం. ఒక చుక్క విషం మొత్తం పాలను విషపూరితం చేస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో మూల్యాంకనం ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్ష అవసరమని భావిస్తున్నాం. అసాధారణ పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీయడానికి అసాధారణమైన దర్యాప్తే సరైన మార్గం. నిధుల దుర్వినియోగం, నిర్వహణ లోపం, మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరం. ఈ నేపథ్యంలోనే సిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా? వీరి జవాబుపత్రాలపై ఉన్న బార్ కోడ్లు, ఒరిజనల్ ఓఎంఆర్ షీట్లు, విజయవాడ మూల్యాంకనంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లపై ఉన్న బార్ కోడ్‌లు సరిపోలుతున్నాయా? లేదా? పరిశీలించండి.
ఈ కేసులో పిటిషనర్లు, ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థుల జవాబుపత్రాలను కూడా తనిఖీ చేయాలి. అలాగే మెరిట్ లిస్ట్‌లో ఆఖరిన ఎంపికైన అభ్యర్థి కంటే దిగువన ఉన్న 100 మంది అభ్యర్థుల జవాబు పత్రాలనూ పరిశీలించాలి. జవాబుపత్రాల ట్యాంపరింగ్‌కు సంబంధించి మరేదైనా సమాచారం ఉంటే శాస్త్రీయ పద్ధతుల ద్వారా గుర్తించండి.
- సిట్‌కు హైకోర్టు ఆదేశం