డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 14 , 2026 | 05:05 AM
డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి 2025 జూలైలో నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది.
20 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి 2025 జూలైలో నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 290 పోస్టులకు 2023 డిసెంబరులో నోటిఫికేషన్ విడుదలవగా.. సుదీర్ఘకాలం తర్వాత గతేడాది పరీక్షలను నిర్వహించారు. ఫలితాల విడుదలకూ ఎక్కువ సమయం పట్టింది. 290 పోస్టులకుగాను, 300 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపిక చేసింది. వారికి ఈనెల 20 నుంచి 29 వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అనంతరం 290 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి తుది ఫలితాలు విడుదల చేస్తారు. పోస్టుల రోస్టర్‌లో స్పష్టత లేకపోవడంతో పరీక్షలు జరిగిన పది నెలల వరకు ఫలితాలు ఇవ్వలేకపోయారు. రోస్టర్‌పై స్పష్టత ఇవ్వాలని కళాశాల విద్యాశాఖను ఏపీపీఎస్సీ కోరింది. స్పష్టత ఇచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో ఫలితాల విడుదలలో జాప్యం ఏర్పడింది.