దోషిగా తేలితే ఏపీపీఎస్సీ జోక్యం అక్కర్లేదు!
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:58 AM
క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగులు ఏదైనా కోర్టులో దోషిగా తేలితే.. వారిపై చర్యలు తీసుకునేముందు ఏపీపీఎస్సీని సంప్రదించాల్సిన అవసరం లేదంటూ..
పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేతపై నిబంధనల సవరణ
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగులు ఏదైనా కోర్టులో దోషిగా తేలితే.. వారిపై చర్యలు తీసుకునేముందు ఏపీపీఎస్సీని సంప్రదించాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ఆర్థికశాఖ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980లోని రూల్ 9(1) స్థానంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారని పేర్కొంది. ‘పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి పూర్తి పెన్షన్ లేదా గ్రాట్యుటీ లేదా రెండింటినీ నిలిపివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ఏపీపీఎస్సీని తప్పనిసరిగా సంప్రదించాలి. అయితే, సదరు పెన్షనర్ ఏదైనా న్యాయస్థాన ప్రక్రియలో దోషిగా తేలితే, అటువంటి సందర్భంలో ఏపీపీఎస్సీని సంప్రదించాల్సిన అవసరం లేదు’ అని సవరించారు.