Share News

ఏపీలోనూ యాపిల్‌ పంట

ABN , Publish Date - Apr 13 , 2026 | 07:02 AM

చల్లని, మంచు ప్రదేశాల్లో పండే యాపిల్‌ పంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించింది. ఉద్యాన పంటలకు నిలయంగా మారిన రాయలసీమలో యాపిల్‌ సాగు ప్రారంభమైంది.

ఏపీలోనూ యాపిల్‌ పంట

  • రాయలసీమలో తోటలు వేసిన రైతులు

  • ‘అనంత యాపిల్‌’ పేరుతో గిఫ్ట్‌ ప్యాక్‌లుగా అమ్మకాలు

  • సాగు ప్రోత్సాహానికి అధ్యయనం: ఉద్యాన శాఖ డైరెక్టర్‌

అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): చల్లని, మంచు ప్రదేశాల్లో పండే యాపిల్‌ పంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించింది. ఉద్యాన పంటలకు నిలయంగా మారిన రాయలసీమలో యాపిల్‌ సాగు ప్రారంభమైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో ముగ్గురు రైతులు యాపిల్‌ సాగు చేపట్టారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. స్థానిక పరిస్థితుల్లో బాగా దిగుబడినిచ్చే కాశ్మీర్‌ లోచిల్లీ డెలిషియస్‌ (కేఎల్‌డీ) రకాన్ని రైతులు పండిస్తున్నారు. గార్లదిన్నె మండలం కోటంకా గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో ఆపిల్‌ వేశారు. 2024 జూలైలో 1,500 మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.280. మొక్కలకు పశువుల కంపోస్ట్‌తోపాటు యూరియా, పొటాష్‌, ఫాస్పేట్‌, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు వాడుతున్నారు. తెగుళ్లు, కీటకాలు ఆశించకుండా కాయలకు కవర్లు తొడుగుతున్నారు. డిసెంబరులో పూతకు వచ్చిన చెట్లు.. ఇప్పుడు కాయలు కాసి, కోతకొచ్చాయి. మొదటి పంట కాస్త తక్కువగా ఉన్నా.. ఎకరానికి సుమారు టన్ను దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ యాపిల్‌ పండ్లు కాశ్మీర్‌ ఆపిల్‌ కన్నా తియ్యగా, రుచిగా ఉన్నాయని రైతులు తెలిపారు. మార్కెట్‌లో నాణ్యమైన ఈ పండ్లకు కిలోకి రూ.170, మధ్యస్థ నాణ్యతకి రూ.120 దాకా పలుకుతోంది. దానిమ్మ మాదిరిగానే రెండో ఏడాది నుంచి కోత ప్రారంభమౌతుంది. ఎక్కడో కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో పండే యాపిల్‌ ఇప్పుడు ఏపీలోనూ ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది.


దిగుబడి పెరుగుతుంది: ఉద్యాన శాఖ డైరెక్టర్‌

సరైన యాజమాన్యంతో రానున్న రోజుల్లో సీమలో ఆపిల్‌ దిగుబడి మెరుగుపడుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురం జిల్లాలో మొదటి సారి సాగైన ‘అనంత యాపిల్స్‌’ను.. పండ్ల గిన్నెగా గిఫ్ట్‌ ప్యాక్లుగా చేసి విక్రయిస్తున్నారు. మంచి రుచిగా ఉండటంతో స్థానికంగా మంచి డిమాండ్‌ వచ్చింది. ఇటీవల అనంతపురంలో జలధార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఒక స్టాల్‌లో ఏర్పాటు చేసిన ‘అనంత యాపిల్‌’ గిఫ్ట్‌ ప్యాక్‌ను పరిశీలించి, ఏపీలోనూ యాపిల్‌ సాగు చేపట్టడాన్ని ప్రశంసించారు. అధిక ఉష్ణోగ్రతలు ఉండే అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లోనూ హాట్‌ జోన్‌ యా పిల్‌ ఉత్పత్తిపై పరిశీలన కోసం ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంత యాపిల్‌పై అధ్యయ నం చేసి, రానున్న రోజుల్లో రాయలసీమతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ యాపిల్‌ సాగును ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు శనివారం తెలిపారు.

Updated Date - Apr 13 , 2026 | 07:02 AM