ఏపీఎంసీ ఎన్నికల్లో 55 శాతం పోలింగ్
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:31 AM
ఏపీఎంసీ ఎన్నికల్లో 30,773 మంది వైద్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికలాధికారి చక్రధర్‌బాబు తెలిపారు.
ఓటు వేసిన 30,773 మంది వైద్యులు.. నేడు ఫలితాల వెల్లండి
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఏపీఎంసీ ఎన్నికల్లో 30,773 మంది వైద్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికలాధికారి చక్రధర్‌బాబు తెలిపారు. ఏపీఎంసీ కార్యవర్గ సభ్యుల ఎన్నికకు సోమవారం ఓటింగ్ నిర్వహించామని ఒక ప్రకటనలో తెలిపారు. 56 వేల మంది వైద్యులు ఓటు హక్కు కలిగి ఉండగా, 30,773 మంది (55 శాతం) వినియోగించుకున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగియాల్సి ఉందని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో రాత్రి 8 గంటల వరకూ ఓటింగ్‌కు అవకాశం కల్పించామన్నారు. 20 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ స్థాయిలో వైద్యులు ఓటు వేయడం మంచి పరిణామన్నారు. తెలంగాణలో 36 శాతం, మహారాష్ట్రలో 21, కర్ణాటకలో 30, తమిళనాడులో 25 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయిందని, ఏపీలో అత్యధికంగా 55 శాతం నమోదయ్యిందని రిజిస్ట్రార్ ఐ.రమేష్ తెలిపారు. ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటిస్తామని చెప్పారు.