‘ఆప్కో’లో అగచాట్లు!
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:56 AM
చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాటైన ‘ఆప్కో’ సమస్యల వలయంలో చిక్కుకుంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ ఇప్పుడు తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతోంది.
సంస్థను చుట్టుముట్టిన సమస్యలు
ఉనికిని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు
సేల్స్ సిబ్బందికి జీతాలూ ఇవ్వలేని దుస్థితి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న షోరూమ్‌ల మేనేజర్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాటైన ‘ఆప్కో’ సమస్యల వలయంలో చిక్కుకుంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ ఇప్పుడు తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే నేతన్నల సంక్షేమం కోసం 50 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) ఏర్పాటైంది. సంప్రదాయ చేనేత కళకు, ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుసంధానంగా నిలుస్తూ చేనేత కళాకారుల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకురావడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా షోరూమ్‌లు ఏర్పాటు చేసి గ్రామీణ చేనేత సొసైటీల నుంచి వస్త్ర ఉత్పత్తులు సేకరించి వినియోగదారులకు విక్రయిస్తోంది. ఆప్కో పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా తయారైంది. షోరూమ్‌ల్లో పనిచేసే సేల్స్ సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఆప్కోలో శాశ్వత ఉద్యోగులు 67 మంది, అవుట్ సోర్సింగ్ ద్వారా మరో 140 మంది పని చేస్తున్నారు. వీరితో పాటు దినసరి వేతనం కింద పనిచేసే సేల్స్ హెల్పర్లు 180 మందికి గత 5 నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. రాష్ట్రంలో 2.5లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా 950 వరకూ చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వాటినుంచి సేకరించే వస్త్రాల విక్రయానికి 85 షోరూమ్‌లు ఉండగా అందులో 15 మెగాషోరూమ్‌లు. వీటిద్వారా ఏటా కోట్లాది రూపాయల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి.
దోపిడీకి అడ్డుకట్ట ఏదీ?
ఆప్కో షోరూమ్‌ల్లో మేనేజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. షోరూమ్‌ల్లో ఉన్న స్టాకు విక్రయించిన సొమ్ము సొంతానికి వాడేసుకొంటున్నారు. విజయవాడలోని మెగా షోరూమ్ మేనేజర్ ఏకంగా రూ.1.70కోట్లు వాడేసి పరారయ్యాడు. మరిన్ని షోరూమ్‌ల్లోనూ సొంతానికి డబ్బులు వాడేసి... జీతాలు రాకపోవడంతో తప్పట్లేదని చెబుతున్నారు. మరి కొన్నిచోట్ల సొంత స్టాకు తెచ్చుకుని షోరూంలో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గోడౌన్లలో స్టాకులోనూ భారీ తేడాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఆ ఉన్నతాధికారి తీరే వేరు.!
చేనేత జౌళి శాఖలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాల్లోని అధికారుల బదిలీ మొదలుకొని ప్రతిదాంట్లోనూ కమీషన్ లేనిదే ఒప్పుకోరని, అత్యంత విలాసవంత జీవితం గడుపుతూ ఆప్కోను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరేం చెప్పినా పట్టించుకోకపోగా వారిపై పగబడుతున్నారని చర్చ జరుగుతోంది. ఆ అధికారి తీరుతో విసిగి వేసారిన కొందరు అధికారులు ఇటీవల గుంటూరులో సమావేశమై ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సిబ్బందిని బదిలీ చేయకుండా అక్కడే ఉంచాలంటే రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు వాపోయారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ప్రభుత్వానికి పంపారు. ఆ అధికారి తాగే రకరకాల ఫ్రూట్ జ్యూస్‌ల నుంచి వ్యక్తిగత సహాయకుల వరకూ ప్రతిదీ ఆప్కో నుంచే భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలు ఎక్కువగా చేస్తూ, హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆప్కోను కనీసం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ‘మీరు ఎవరికి చెప్పినా లెక్క చెయ్యను.. మీకు మాత్రం జీతాలు ఇవ్వను..’ అని తెగేసి చెబుతున్నట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండగలకు రూపాయి ఇవ్వలేదని, సంక్రాంతికి కూడా ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. ఆప్కోను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సంక్షేమ శాఖలు ఈ సంస్థ నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు సర్కారు గతంలోనే జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ ఉత్తర్వు అమలు కావట్లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర సంక్షేమ హాస్టళ్లు పొరుగు రాష్ట్రాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తున్నాయి. తమకు అవసరమైన దుప్పట్లు, టవళ్లు, ఇతరత్రా ఆప్కో సరఫరా చేయలేక పోవడమే అందుకు కారణమని ఆయా శాఖల బాధ్యులు చెబుతున్నారు. అయితే కమీషన్ల కోసమే ప్రైవేటు వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారని చేనేత వర్గాలు ఆరోపిస్తున్నాయి.