ఆర్‌వో ప్లాంట్లలో బొక్కేశారు!
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:51 AM
పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్ల కొనుగోలులోనూ నిధులు బొక్కేశారన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రెండు సంస్థలు భారీ వ్యత్యాసంతో ప్లాంట్లు కొనుగోలు చేయడమే దీనికి కారణం.
ఒక్కో ప్లాంటుపై రూ.1.25 లక్షలు అదనం
ఒక్కోటి రూ.6.25 లక్షలకు కొన్న ఏపీఈడబ్ల్యూఐడీసీ
వాటినే ఇప్పుడు రూ.5 లక్షలకు కొంటున్న సమగ్ర శిక్ష
ఏపీఈడబ్ల్యూఐడీసీపై గతంలోనూ అనేక ఆరోపణలు
పాఠశాలల్లో ప్లాంట్ల నిర్వహ్వణలోనూ లోపాలే
స్కూళ్లకు రంగులు.. ఫ్యాన్ల ఏర్పాటులోనూ అవకతవకలు?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్ల కొనుగోలులోనూ నిధులు బొక్కేశారన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రెండు సంస్థలు భారీ వ్యత్యాసంతో ప్లాంట్లు కొనుగోలు చేయడమే దీనికి కారణం. గతేడాది విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఒక్కో ప్లాంట్ ను రూ.6.25 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అవే ప్లాంట్లను సమగ్రశిక్ష విభాగం రూ.5 లక్షలకే కొనుగోలు చేస్తోంది. ఒక్కో ప్లాంట్‌కు రూ.1.25 లక్షలు వ్యత్యాసం ఉండటంపై చర్చ జరుగుతోంది.
206 స్కూళ్లలో బొక్కేశారు
రాష్ట్రంలో వెయ్యికిపైగా పీఎంశ్రీ పాఠశాలలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వాటిలో మౌలిక సదుపాయాలను పాఠశాల విద్యాశాఖ అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందించే ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు సమగ్రశిక్ష చర్యలు చేపట్టింది. తొలుత 206 పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. ఆ సంస్థ టెండర్లు పిలిచి ఒక్కో ప్లాంట్‌ను రూ.6.25 లక్షలకు కొనుగోలు చేసేలా ఖరారు చేసింది. గతేడాది మొదలైన ప్లాంట్ల ఏర్పా టు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో విసిగిపోయిన సమగ్రశిక్ష ఈ ఏడాది 308 పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. గంటకు 300 లీటర్ల నీరు అందించే ప్లాంట్‌ను రూ.5 లక్షలకు, 200 లీటర్ల ప్లాంట్‌ను రూ.4.65 లక్షలకు కొనుగోలు చేసేలా టెండర్లు ఖరారు చేసింది. ఏపీఈడబ్ల్యూఐడీసీ అవే ప్లాంట్లను భారీ ధరకు కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్వహణలోనూ అనేక లోపాలు
ఏపీఈడబ్ల్యూఐడీసీ కొనుగోలు చేసిన ఆర్వో ప్లాంట్లలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. ప్లాంట్లు పనిచేయనప్పుడు టెక్నీషియన్లకు టీచర్లు ఫోన్లు చేస్తే చాలా చోట్ల స్పందన కరువైంది. దీంతో ఇప్పుడు ముందు జాగ్రత్తగా సమగ్రశిక్ష 66 నెలల నిర్వహణ బాధ్యతకు డిపాజిట్ తీసుకుంటోంది. మొత్తం కాంట్రాక్టు విలువలో 5శాతంను డిపాజిట్‌గా తీసుకుని 66 నెలలు సక్రమంగా నిర్వహణ చేస్తేనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
గతంలో రంగుల్లోనూ గోల్‌మాల్..
గత ప్రభుత్వం నాడు-నేడు పథకం పేరుతో భారీగా నిధులు ఖర్చు చేసింది. అందులో భారీ కాంట్రాక్టులన్నీ ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. ప్రధానంగా పాఠశాలలకు రంగుల అంశం అప్పట్లో పెద్ద వివాదమైంది. వందల కోట్లు ఖర్చు చేసి పాఠశాలలకు వైసీపీ రంగులు వేయడంపై దుమారం రేగింది. అనంతరం కోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి, సాధారణ రంగులు వేశారు. పాఠశాలల గోడలపై రంగులతో భారీ బొమ్మలు వేయగా కొద్ది రోజులకే చాలా చోట్ల రంగులు పెచ్చులుగా ఊడిపోయి, బొమ్మల రూపురేఖలు మారిపోయాయి. అలాగే, గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో బిగించిన ఫ్యాన్లపైనా అనేక ఆరోపణలున్నాయి. 2021-22లో నాడు-నేడు పథకం అమలులో అనేక లోపాలను కాగ్ ఎత్తిచూపింది. ఆర్‌పీఎం తక్కువగా ఉన్న ఫ్యాన్లను కొనుగోలు చేసి బిల్లులు చెల్లించినట్లు కాగ్ ఆక్షేపించింది. ఇలా ఏపీఈడబ్ల్యూఐడీసీ కొనుగోలు చేసిన వాటిపై అనేక ఆరోపణలున్నా అనుభవం ఉందనే కారణంతో గతేడాది సమగ్రశిక్ష ఆర్వో ప్లాంట్లను అదే సంస్థకు అప్పగించింది. తీరా ఆ సంస్థ పనితీరు సరిగా లేదనే కారణంతో సొంతంగా టెండర్లు పిలవగా అసలు విషయం బయటపడింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.1.25 లక్షలు అదనంగా చెల్లించారు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే దానిపై విచారణ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏపీఈడబ్ల్యూఐడీసీ కొనుగోళ్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారులు పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్నారనే విమర్శలున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.