Share News

చార్జీల భారం వెయ్యొద్దు

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:54 AM

నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని, వినియోగదారులపై కరెంటు చార్జీల భారం మోపవద్దని విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పలువురు విన్నవించారు.

చార్జీల భారం వెయ్యొద్దు

  • ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో పలువురి వినతి

  • తొలిరోజు ప్రజాభిప్రాయ సేకరణకు 17 మంది హాజరు

అమరావతి/విజయవాడ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని, వినియోగదారులపై కరెంటు చార్జీల భారం మోపవద్దని విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పలువురు విన్నవించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న కరెంటు చార్జీలపై ఏపీఈఆర్సీ గురువారం విజయవాడలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో తొలిరోజు రాజకీయ పార్టీల నేతలు, రైతుసంఘాల ప్రతినిధులు, విద్యుత్తు రంగ నిపుణులు మొత్తం 17 మంది పాల్గొన్నారు. తమ ఫిర్యాదులు, అభ్యంతరాలను మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి దృష్టికి తెచ్చారు. మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో అధిక చెల్లింపులతో ఏపీ ట్రాన్స్‌కో సుమారు రూ.14.65 కోట్లు నష్టపోయిందని, ఈ కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడుతోందని తెలిపారు. ఏపీఎస్సీడీసీఎల్‌ పరిధిలో టెండరు ప్రక్రియకు స్వస్తి పలికి నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరకు ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేశారని, ఛత్తీస్‌గఢ్ కంటే 91 శాతం, తెలంగాణ కంటే 60 శాతం అధిక ధర చెల్లించారని, వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపాలని కోరారు. సోలార్‌ ప్లాంట్ల అసోసియేషన్‌ తరఫున వీఎస్‌ తేజ మాట్లాడుతూ.. సోలార్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్లను ఆఫ్‌ పీక్‌ సమయంలో రెగ్యులర్‌ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. తాజాగా బిల్లింగ్‌ టారిఫ్‌లను డిస్కంలు మార్చేశాయని, టైం ఆఫ్‌ టారిఫ్‌ అమలు చేయడంతో కరెంటు బిల్లుల్లో ఎలాంటి ఆదా ఉండటం లేదని చెప్పారు. రైతు సంఘాల తరఫున వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఈఆర్సీకి ఇంతకుముందు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ నాగార్జునరెడ్డి రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. విద్యుత్తు టవర్లు, హెచ్‌టీ లైన్లు పొలాల్లో ఏర్పాటు చేయడం వల్ల భూములు కోల్పోయిన రైతులకు నేటికీ ఉపాధి కల్పించలేదని విన్నవించారు. శుక్రవారం కూడా ఈ అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది.


రైల్వేపై విద్యుత్తు భారం తగ్గించండి: ఎస్‌సీఆర్‌

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యుత్తు చార్జీలు అధికంగా ఉన్నాయని, వాటిని హేతుబద్ధీకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ఎస్‌సీఆర్‌ ప్రతినిధి దినేశ్‌ రెడ్డి.. ఈ మేరకు ఏపీఆర్సీకి వినతి పత్రం సమర్పించారు. రైల్వే వినియోగించుకుంటున్న విద్యుత్తుపై తెలంగాణలో యూనిట్‌కు రూ.7.03, కేరళలో రూ.5.79, ఒడిశాలో రూ.6.29 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం అత్యధికంగా రూ.9.30 వసూలు చేస్తున్నారని, దీన్ని హేతుబద్ధీకరించాలని కోరారు. నిర్ణీత గడువులోగా బిల్లులు చెల్లిస్తున్నందుకు ఒడిశా ప్రభుత్వం తమకు ఒక శాతం రిబేటు ఇస్తోందని, ఇక్కడ కూడా రిబేటు అమలు చేయాలని విన్నవించారు.

Updated Date - Jan 23 , 2026 | 05:17 AM