స్మార్ట్ మీటర్లను సరి చేయండి: ఈఆర్‌సీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:00 AM
స్మార్ట్ మీటర్లతో విద్యుత్తు బిల్లులు భారీగా వస్తున్నా యన్న ఆరోపణలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పందించింది.
రీడింగ్ లోపాలు సరిదిద్ది.. బిల్లులు సర్దుబాటు చేయాలని ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్లతో విద్యుత్తు బిల్లులు భారీగా వస్తున్నా యన్న ఆరోపణలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పందించింది. స్మార్ట్ మీటర్ల వల్ల ఎక్కువ మొత్తంలో బిల్లులు చెల్లించిన వారికి ఆ మొత్తాలను తదుపరి బిల్లుల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇళ్లలో ఫ్యాను తిరగడం, లైటు వెలగడం కారణంగా విద్యుత్తు ఖర్చవుతుంది. దీన్ని ‘యాక్టివ్ పవర్’ అంటారు. నెలవారీగా ఉపయోగించిన విద్యుత్తును ఇన్ని యూనిట్లు అని లెక్కిస్తుంటారు. ఫ్యాను, లైటు వాడకపోయినా ఇంటిలో విద్యుత్తు సరఫరాలో వోల్టేజీని నియంత్రణలో ఉంచడానికి కొంత విద్యుత్తు ఖర్చవుతుంది. దీన్నే లీడింగ్ కేవీఏఆర్‌హెచ్(కిలోవాట్ యాంపియర్ రియాక్టివ్ హవర్) అంటారు. పాత మీటర్లలో యూనిట్లను మాత్రమే లెక్కించి, లీడింగ్ కేవీఏఆర్‌హెచ్‌ను లెక్కకట్టే వీలు లేకుండా ఏర్పాటు ఉండేది. స్మార్ట్ మీటర్లలో ఆ సౌకర్యం లేకపోవడంతో మనం విద్యుత్తును ఉపయోగించకపోయినా అధిక బిల్లులు రావడం, గతంలో కన్నా ఎక్కువ బిల్లులు రావడం జరిగేది. దీనిపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో.. స్మార్ట్ మీటర్లలో లీడింగ్ కేవీఏఆర్‌హెచ్‌ను లెక్కించవద్దని, ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ సోమవారం ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో వినియోగదారులు ఇప్పటి వరకు అదనపు రీడింగ్ వల్ల చెల్లించిన అధిక మొత్తాలను సర్దుబాటు చేయాలని ఆదేశించింది.