Share News

తిరుపతిలో ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:46 AM

2026-27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్తు టారి్‌ఫలపై తిరుపతి వేదికగా మంగళవారం ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.

తిరుపతిలో ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ

  • నేరుగా ముగ్గురు, వర్చువల్‌గా నలుగురు హాజరు

తిరుపతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): 2026-27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్తు టారి్‌ఫలపై తిరుపతి వేదికగా మంగళవారం ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఏపీఈఆర్సీ చైర్మన్‌ పీవీ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో నేరుగా ముగ్గురు (వీరిలో ఒకరు వ్యక్తిగత సమస్యను ప్రస్తావించారు), వర్చువల్‌గా నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సీపీఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిసార్లు చార్జీలు పెంచి రూ.37 వేల కోట్ల భారాన్ని మోపారని తెలిపారు. గత ప్రభుత్వం పెంచిన విద్యుత్తు సుంకాన్ని, చార్జీలను ప్రస్తుత ప్రభుత్వం యథాతథంగా వసూలు చేస్తోందని చెప్పారు. డిస్కంలు సమర్పించిన నివేదికల్లో బోగస్‌ లెక్కల కారణంగానే రూ.12,771 కోట్ల భారం వేయాలని ప్రభుత్వం తరపున పంపిణీ సంస్థలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఒక్క సంతకంతో రూ.84 కోట్ల లబ్ధి పొందారని మాజీ సీఎండీ గురించి మీడియాలో వార్తలు వస్తున్నా, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వాటర్‌ ప్లాంట్లకు ఇచ్చే విద్యుత్తు సర్వీసు కేటగిరీని రెండు నుంచి మూడుకు మార్చాలని అనంతపురానికి చెందిన రామ్మోహన్‌ కోరారు. తిరుచానూరు పరిధిలోని తమ స్థలంలో కబ్జాదారులు గది కడితే కరెంటు మీటరు ఇచ్చేశారని, దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు తమను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ టీచర్‌ కమలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా కరెంటు చార్జీలు తగ్గించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు వర్చువల్‌గా కోరారు.

Updated Date - Jan 21 , 2026 | 04:43 AM