జూన్ 1న ‘ఈఏపీసెట్’ ఫలితాలు!
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:10 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 1న విడుదల చేసే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి తెలిపింది. తుది ఫలితాల విడుదల తాత్కాలిక తేదీ...
వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన ఉన్నత విద్యామండలి
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 1న విడుదల చేసే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి తెలిపింది. తుది ఫలితాల విడుదల తాత్కాలిక తేదీ, దరఖాస్తులు, పరీక్షల తేదీలకు సంబంఽధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. 23న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మరోవైపు ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష జరుగుతుంది. మే 7న ఫలితాలు విడుదల చేస్తారు. ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గురువారం ప్రారంభం కాగా, మార్చి 2 వరకు గడువుంది. మే 2న పరీక్ష, 16న ఫలితాలు ప్రకటిస్తారు.
ఆర్టీఈ అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్
వచ్చే విద్యా సంవత్సరానికి విద్యాహక్కు చట్టం అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ ప్రక్రియ ప్రారంభించింది. అడ్మిషన్ల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ జ్ట్టిఞ://ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ ద్వారా పిల్లల తల్లిదండ్రులు ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా విద్యార్థుల అర్హతను మార్చి 17 నాటికి నిర్ధారిస్తారు. మార్చి 25న మొదటి విడత లాటరీ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. 26 నుంచి ఏప్రిల్ 7 వరకు విద్యార్థుల ప్రవేశాలను పాఠశాలలకు వెళ్లి ధృవీకరించుకోవాలి. రెండో విడత లాటరీ ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల్లో చేరి అడ్మిషన్లను ధృవీకరించుకోవాలి.
టెన్త్ పరీక్ష ఫీజులకు తత్కాల్ అవకాశం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించనివారికి తత్కాల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 12 వరకు రూ.వెయ్యి ఆలస్య రుసుముతో తత్కాల్ విధానంలో ఫీజు చెల్లించవచ్చన్నారు.