Share News

అర్ధ శతాబ్ది ఆప్కో

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:23 AM

ధర్మవరం పట్టు.. మంగళగిరి నేత చీర... పొందూరు ఖాదీ... తెలుగు జాతి ఔన్నత్యానికి ప్రతీకలుగా నిలిచిన వస్త్రాలు. రంగు రంగుల సన్నని దారాలతో నేత వస్త్రాలపై అద్భుత కళాఖండాలు సృష్టించగల..

అర్ధ శతాబ్ది ఆప్కో

  • లక్షలాది మందికి ఉపాధి కల్పించిన సహకార సంస్థ

  • చేనేత వర్గాలకు అండగా.. 1976 జూలై 6న ఆవిర్భావం

  • నాడు ఓ వెలుగు వెలిగి.. నేడు ప్రభుత్వాల ఆదరణ కరువై!

  • ముడిసరుకు సరఫరా లేదు.. నేతన్నకు పనీ లేదు

  • సంక్షేమ శాఖల ఆర్డర్లు లేవు.. ఆప్కోకు ఆదాయమూ లేదు

  • చేయూత కోసం నేతన్నల ఎదురుచూపులు

  • రేపు మంగళగిరిలో అర్ధ శతాబ్ది వేడుకలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ధర్మవరం పట్టు.. మంగళగిరి నేత చీర... పొందూరు ఖాదీ... తెలుగు జాతి ఔన్నత్యానికి ప్రతీకలుగా నిలిచిన వస్త్రాలు. రంగు రంగుల సన్నని దారాలతో నేత వస్త్రాలపై అద్భుత కళాఖండాలు సృష్టించగల నేర్పు మన చేనేతల సొంతం. రాత్రింబవళ్లు కష్టపడి.. పోగు పోగు కూర్చి అందమైన చీరకు రూపు ఇచ్చే నేతన్నలు. అలాంటి చేనేత కళాకారులకు ఊతమిస్తూ 1976 జూలై 6న మూడు ప్రాంతీయ చేనేత సంస్థల విలీనంతో ‘ఆప్కో’ ఏర్పాటయ్యింది. నాటి నుంచి ఐదు దశాబ్దాలుగా చేనేత వర్గాలకు అండగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఐదేళ్లు బాగానే ఉన్నా 2019 నుంచి ఆప్కో పతనం ప్రారంభమైంది. 2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేనేతకు జీవం రాలేదు. ఆప్కో నిలదొక్కుకోలేదు.

నేతన్నలకు ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌, సంప్రదాయ కళకు రక్షణ కల్పిస్తూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చీ రాగానే చేనేత వస్త్రాలు స్వయంగా ధరించడంతోపాటు ‘జనతా వస్త్రం’ పేరుతో ఆ రంగానికి జీవం పోశారు. ఆతర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ సంక్షేమ పథకాలను కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖల అవసరాలకు ఆప్కో ద్వారా నేత వస్త్రాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 24, విభజిత రాష్ట్రంలో జీవో 142 విడుదల చేసింది. చేనేతకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించి ఆప్కోను బలోపేతం చేసి, రిబేటు అమలు చేసింది.


రాష్ట్ర చేనేత సహకార సంఘాల్లోని కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ‘చేనేత కార్మికుల్లో నైపుణ్యాలు పెంచాలి. అధునాతన డిజైన్ల ఉత్పత్తి జరగాలి. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ కల్పించాలి. ఇందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుంది. ముడి సరుకుతోపాటు వస్త్రం పైనా రాయితీ ఇద్దాం’ అంటూ 2019 వరకూ ఈ పాలసీ అమలు చేశారు. చేనేతను బలోపేతం చేస్తా.. ఆప్కోను ప్రక్షాళన చేస్తా.. అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్‌ చేనేత నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన మరమగ్గాల నుంచి కొనుగోలు చేశారు. ఫలితంగా ఏపీ చేనేతలు ఇప్పుడు పూట కూలి కూడా తెచ్చుకోలేకపోతున్నారు. అపురూపమైన కళను వదిలి వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలో నూలు డిపోలు ఎన్ని ఉన్నా నేత కార్మికుడికి ముడిసరుకు ఇవ్వకుండా ఐదేళ్లపాటు పాలకులు తీరని అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... సబ్సిడీపై నూలు అందజేసి పని కల్పించాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకొంటుంటే.. మార్కెటింగ్‌ ప్రమోషన్‌ కల్పించాలని చేనేత సహకార సంఘాలు, ఆప్కో అడుగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేనేత వస్త్రంపై జీఎ్‌సటీ విధించడం, చేనేత రిజర్వేషన్‌ డిజైన్లు(11) పవర్‌ లూమ్స్‌లో ఉత్పత్తి చేస్తుండటం, అధునాతన డిజైన్లు, ముడిసరుకు కోసం బ్యాంకులు రుణాలివ్వక పోవడం చేనేత రంగం కుదేలు అవడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యాభై ఏళ్ల సంబరాల సంబర్భంలోనైనా ఆప్కో బలోపేతానికి, చేనేతలకు చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.


చంద్రబాబు జీవో తెలంగాణలో అమలు.. ఇక్కడేమో?

చేనేత కార్మికులకు ముడిసరుకు ఇచ్చి, వస్త్రాల ఉత్పత్తికి తోడ్పాటు అందించి, వాటిని కొనుగోలు చేసి ఆప్కో ద్వారా విక్రయాలు పెంచాల్సిన చేనేత జౌళి శాఖ అందుకు పూర్తి భిన్నమైన పనులు చేస్తోంది. ‘చేనేత వస్త్రాలకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. నేతలో ఆధునికీకరణ జోడిస్తే ఆ వర్గాల ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. జిల్లాల కలెక్టర్లు ఈ దిశగా ఆలోచించాలి’ అని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో చేనేతపై చర్చ సందర్భంగా చెప్పారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేవారికి ముడిసరుకు అందించడంతోపాటు చేనేత అభివృద్ధిపై దృష్టి సారించాలని, కార్మికుల జీవనోపాధికి ప్రభుత్వం నుంచి భరోసా దక్కాలని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలోనే నేతన్నలకు చేయూత దక్కడం లేదు. ప్రభుత్వ సంక్షేమ శాఖల అవసరాలకు తప్పనిసరిగా చేనేత వస్త్రాలే కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణలో అమలు చేస్తుంటే ఏపీలో ఆయన పాలనలోనే అమలు కావట్లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు దుప్పట్లు, తువ్వాళ్ల కొనుగోళ్ల ఆర్డర్లను వేర్వేరు మార్గాల్లో తాము అనుకున్న వ్యాపారులకు ఇస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యాపారులు, దళారులు కలిసి పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇక్కడ అధిక ధరకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వస్త్ర టెండర్లలో సైతం ఆప్కో పాత్ర నామమాత్రం చేసి డమ్మీ టెండర్లు వేయించి చక్రం తిప్పిందెవరో ఆ శ్రీనివాసుడికే తెలియాలి. చేనేత మంత్రికి, ఒక ఉన్నతాధికారికి మధ్య విభేదాలు సృష్టించి వ్యాపారులు పబ్బం గడుపు కొంటున్నారనే విమర్శలు చేనేత జౌళి శాఖలో బలంగా వినిపిస్తున్నాయి.


మన వాళ్ల పొట్టకొట్టి.. పొరుగు వస్త్రం కొనుగోలు

ఆంధ్రప్రదేశ్‌లో కాటన్‌, పట్టు, ఉల్లన్‌ సహకార సంఘాల ద్వారా ఉపాధి పొందే లక్షలాది మంది నేతన్నలను ఆదుకోవడానికి గత ప్రభుత్వాలు నూలు, పట్టు, ఇతర ముడిసరుకు రాయితీపై సరఫరా చేసేవి. సహకార సంఘాల నుంచి ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాన్ని కొనుగోలు చేసి చేనేతకు ఊతమిచ్చేవి. అయితే జగన్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ కోసం కోట్లాది మీటర్ల వస్త్రం అవసరం కాగా మన రాష్ట్రంలోని ఒక్క చేనేత సంఘానికి లేదా కార్మికుడికి నూలు ఇచ్చిన పాపాన పోలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కమీషన్ల కోసం నాసిరకం వస్త్రాలు కొనుగోలు చేసింది. నాణ్యతను నిర్ధారించే ‘రైట్స్‌’ వద్దన్నా కొనుగోలు చేయడం వెనుక కోట్లాది రూపాయల కమీషన్లు చేతులు మారినట్లు మహిళా మాజీ మంత్రిపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ సరిచేస్తారనుకున్నా... రెండు ప్రభుత్వాలు ఇంతేనని చేనేతలకు త్వరగానే అర్థమైంది.

Updated Date - Jul 05 , 2026 | 05:26 AM