ఇంటింటికీ యోగా!
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:33 AM
రాష్ట్రంలో యోగాను సంజీవని పథకంతో అనుసంధానించడం ద్వారా ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.
సంజీవనితో అనుసంధానం.. యోగాంధ్రలో కోటి దాటిన రిజిస్ట్రేషన్లు
1.33 లక్షల సెంటర్లలో యోగా డే నిర్వహణ.. 19నే రానున్న బాబా రాందేవ్
20న ఆయనతో కలిసి ఉండవల్లి గుహల వద్ద సీఎం యోగా
21న ప్రధాన కార్యక్రమానికీ హాజరు.. యోగా డేపై సీఎం సమీక్ష
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యోగాను సంజీవని పథకంతో అనుసంధానించడం ద్వారా ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ‘యోగా డే’ నిర్వహణపై బుధవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. యోగాంధ్రలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించాలని నిర్దేశించారు. అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రత్యేక పురస్కరాలు అందించాలన్నారు. ‘ఇంటింటికీ యోగా’ ప్రధాన థీమ్‌గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సారి ప్రత్యేక అతిఽథిగా వస్తున్న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఈ నెల 20 ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం నిర్ణయించారు. 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహిస్తారు. స్టేడియంలో 5 నుంచి 6 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కూడా బాబా రాందేవ్ హాజరవుతారు. వర్షం కారణంగా ఏమైనా అవాంతరం తలెత్తితే, ప్రత్యామ్నాయంగా విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో వెయ్యి మందితో కార్యక్రమం నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యోగా ప్రచారంలో భాగంగా 19వ తేదీనే రాష్ట్రానికి వస్తున్న బాబా రాందేవ్ అదే రోజు సీఎంతో భేటీ అవుతారు.
యోగాంధ్రలో భాగంగా ఇప్పటి వరకూ 2.6 లక్షల మందిని ట్రైనర్లుగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు. 21న యోగాడేలో పాల్గొనేందుకు ఇప్పటికే కోటికి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 18వ తేదీ నుంచి 20 వరకూ విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని, 21వ తేదీన 1.33 లక్షల సెంటర్లలో యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 21న ‘యోగా ఎట్ డెస్టినేషన్’ పేరుతో వచ్చే ఏడాది యోగా డే వరకూ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేయనున్నారు. ఈ సమీక్షకు ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, కమిషనర్ చక్రధర్‌బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు.