మహిళలను కించపరిచే వ్యాఖ్యలను కట్టడి చేయాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:13 AM
మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులను కట్టడి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజ్ఞప్తి
కమిషన్ ముందుకు వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్
గుంటూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులను కట్టడి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు నోటీసులు పంపామని, మంగళవారం ఆయన కమిషన్ ఎదుట హాజరై మౌఖికంగా, రాతపూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించామని.. ఆయన వివరణను పరిశీలించి, సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. భవిష్యత్‌లో మహిళలపె ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కమిషన్‌కు అమర్నాథ్ మాటిచ్చారు.
అవన్నీ పొలిటికల్ సెటైర్లే... దురుద్దేశాల్లేవు మహిళా కమిషన్ ఎదుట అమర్నాథ్ వివరణ
హోంమంత్రి వంగలపూడి అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలన్నీ రాజకీయ సెటైర్లేలేనని... వాటికి విపరీతార్థాలు తీయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు మంగళగిరి ఎన్నారై జంక్షన్‌లోని కార్యాలయంలో విచారణకు హజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శైలజ ఆయన్ను 19 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తానేమీ తప్పు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్‌కు స్పష్టం చేశానని వివరించారు. అమర్నాథ్‌తో పాటు కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆయన్నూ అనుమతించారు.