ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక
ABN , Publish Date - May 05 , 2026 | 06:36 AM
రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తామని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ వెల్లడి
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తామని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. ట్రాన్స్‌జెండర్లు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అవసరాలు, అభ్యర్థనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గతనెల 7న విజయవాడలో జరిగిన ట్రాన్స్‌జెండర్ల సదస్సులో తెలుసుకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న హామీ మేరకు సోమవారం మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్స్ ప్రతినిధులతో ఆమె సమావేశమై, ప్రభుత్వానికి అందించే నివేదికపై చర్చించారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ గౌరవప్రదంగా జీవించడం, సమాన అవకాశాలు పొందటంపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మంత్రి లోకేశ్‌ను కలిసి సమస్యలు, అవసరాలను వివరించే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్స్ ప్రతినిధులకు ఆమె కల్పించారు. ట్రాన్స్‌జెండర్ల ఆవేదనను మంత్రి లోకేశ్ ఓపికగా విని, సానుకూలంగా స్పందించారని శైలజ వివరించారు.