Share News

బహ్రెయిన్‌లో ‘పశ్చిమ’ యువతి ఆత్మహత్య

ABN , Publish Date - May 06 , 2026 | 04:32 AM

మగదిక్కు లేని కుటుంబానికి అండగా ఉన్న యువతి దేశంకాని దేశంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అడ్డంకిగా మారాయి.

బహ్రెయిన్‌లో ‘పశ్చిమ’ యువతి ఆత్మహత్య

  • నాలుగు నెలల క్రితం ఉద్యోగం కోసం రాక

  • మృతదేహం తరలింపునకు అడ్డంకిగా ఇరాన్‌ ఉద్రిక్తతలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

మగదిక్కు లేని కుటుంబానికి అండగా ఉన్న యువతి దేశంకాని దేశంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు అడ్డంకిగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్థనపు కవిత (21)కు నలుగురు చెల్లెళ్లు, తల్లి ఉన్నారు. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ విద్యనభ్యసించిన కవిత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వచ్చింది. అమె తన అర్హతలకు తగినట్టు వైద్య రంగంలో కాకుండా, ఒక అరబ్బు యాజమాని ఇంట్లో మెయిడ్‌గా పని చేయడానికి వచ్చింది. ఈ క్రమంలో గత నెల 23న ఆమె తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కవిత మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి అవసరమైన మొత్తం ఖర్చును భరించడానికి యజమాని నిరాకరించారు. దీంతో బహ్రెయిన్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బొక్క గిరిబాబు, సత్యనారాయణ, రమణ, మరికొందరు తెలుగు చర్చి సభ్యులతో పాటు కొంత మొత్తాన్ని యజమాని చెల్లించారు. సోమవారం మృతదేహాన్ని ఏయిర్‌ అరేబియా విమానం ద్వారా స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, కానీ ఇరాన్‌ ఉద్రిక్తతల కారణంగా విమానం రద్దయినట్టు గిరిబాబు తెలిపారు. కవిత మృతదేహాన్ని త్వరలో స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - May 06 , 2026 | 04:33 AM