Share News

ఏప్రిల్‌ నుంచి చేనేతకు ఉచిత విద్యుత్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:36 AM

చేనేతలకు ఉచిత విద్యుత్‌ హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్‌ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.

ఏప్రిల్‌ నుంచి చేనేతకు ఉచిత విద్యుత్‌

  • మగ్గాలకు 200, మర మగ్గాలకు 500 యూనిట్లు: మంత్రి సవిత

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): చేనేతలకు ఉచిత విద్యుత్‌ హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్‌ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. మర మగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్లు వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో కలిసి, మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు వల్ల ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుంది. ఉచిత విద్యుత్‌ వల్ల 93 వేల మగ్గాలు, 10,534 మర మగ్గాలతో కలిపి 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మగ్గానికి నెలకు రూ.720, ఏడాదికి రూ.8,640, మర మగ్గాలకు నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 లబ్ధి కలుగుతుంది’ అని మంత్రి వివరించారు. గత రెండు నెలల్లో ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. కాగా, ఆప్కోలో రెడీమేడ్‌ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు ఉపాధి పెరిగిందని, ఈ-కామర్స్‌ ద్వారా చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నామని మంత్రి తెలిపారు.

Updated Date - Jan 30 , 2026 | 05:36 AM