Share News

కేంద్ర బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:38 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ చేనేత సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది.

కేంద్ర బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించాలి

  • ‘సహకార’ బకాయిలు రూ.203 కోట్లు చెల్లించాలి

  • చేనేతల గర్జనలో నేతన్నల డిమాండ్‌

మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ చేనేత సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. చేనేత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత గర్జన నిర్వహించారు. కార్మికులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ సభలో జేఏసీ కన్వీనర్‌ పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని ప్రభుత్వాలు విస్మరించడం బాధాకరమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలని, సహకార సంఘాలకు చెల్లించవలసిన రూ.203 కోట్లను విడుదల చేయాలని, ప్రతి నేత కార్మికుడికి ఏటా రూ.25 వేలు ఇవ్వాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేయాలని, 11 రకాల రిజర్వేషన్‌ చట్టంపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. గర్జనలో జేఏసీ నాయకులు దుర్గారావు, పూర్ణచంద్రరావు, వి.రమేష్‌, కృష్ణప్రసాద్‌, మాచర్ల మోహన్‌, వీరనాగేశ్వరరావు, రాపోలు జగన్‌, రుషింగప్ప, కోటేశ్వరరావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 04:38 AM