నేడు సీమలో ఎండమంటలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:04 AM
రాష్ట్రంలో ఒకపక్క ఎండలు, మరోపక్క వర్షాలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో అనిశ్చితి కొనసాగింది.
కోస్తాలో పిడుగుల వర్షాలు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకపక్క ఎండలు, మరోపక్క వర్షాలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో అనిశ్చితి కొనసాగింది. దీనికితోడు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో అత్యధికంగా 44, కాకినాడ జిల్లా డీ.పోలవరంలో 37.7, తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో 32.2, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 26 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాయలసీమలో ఎండ.. ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.2, చిత్తూరు జిల్లా నగరిలో 42.1, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 41.9, కడప జిల్లా పులివెందులలో 41.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.7, కర్నూలు జిల్లా తోవి, మార్కాపురం జిల్లా అనుములపల్లెలో 41.6, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.