Share News

అక్కడక్కడ వర్షాలు.. రాష్ట్రమంతా ఎండలే!

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:07 AM

ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి.

అక్కడక్కడ వర్షాలు.. రాష్ట్రమంతా ఎండలే!

  • బోట్లగూడూరులో 43.4 డిగ్రీలు.. 155 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా..

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. వీటి ప్రభావంతో వాతావరణంలో తీవ్ర అనిశ్చితి నెలకొని మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో 60 మి.మీ., అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాంలో 54మి.మీ., విజయరామరాజుపేటలో 36.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రంలో ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వేసవిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు మంగళవారం నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 155 మండలాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మార్కాపురం జిల్లా బోట్లగూడూరులో 43.4, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో 42.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురువారాల్లో పగలు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రంగా ఉంటుందని, మరోవైపు మేఘావృత వాతావరణంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విభిన్న వాతావరణం పరిస్థితులు కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ సూచించారు.

Updated Date - Apr 08 , 2026 | 04:07 AM