పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికే పెద్దపీట!
ABN , Publish Date - Aug 15 , 2026 | 04:47 AM
రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగానే (వాటర్ మూవ్‌మెంట్ ప్లాన్) ప్రకారమే నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని స్పష్టంచేశారు.
పారిశ్రామికావసరాలకు తర్వాతి ప్రాధాన్యం: సీఎం
రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి సద్వినియోగమే కీలకం
నెలవారీ లక్ష్యాలతో ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి
పోలవరం వద్ద గండిపోశమ్మ గుడిని పరిరక్షించాలి
మార్చికల్లా విశాఖ వరకూ ఎడమ కాలువ పూర్తి చేయాలి
డేటా సెంటర్లకు మూడున్నర టీఎంసీలు చాలు.. అయినా కొందరి దుష్ప్రచారం
జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగానే (వాటర్ మూవ్‌మెంట్ ప్లాన్) ప్రకారమే నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని స్పష్టంచేశారు. పారిశ్రామికావసరాలకు ద్వితీయ ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి నిల్వలను, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఈ సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో జల వనరుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ సహా ప్రాధాన్య క్రమంలో చేపడుతున్న 36 ప్రాజెక్టుల పురోగతి, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక జలహారతి కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎడమ కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-1 ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-2 పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇటీవల గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించామని తెలిపారు. డ్యాం సైట్ వద్ద రహదారులతో పాటు డ్యాం నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు కూడా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలో గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్‌ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది మార్చికల్లా విశాఖ వరకూ ఎడమ ప్రధాన కాలువ బ్యాలెన్సు పనులు పూర్తి చేయాలన్నారు. ఈలోగా అనకాపల్లి వరకూ ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు నింపాలని సూచించారు. పోలవరం కుడి, ఎడమ కాలువల్లో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా పనులు చేయాలని స్పష్టం చేశారు. ఈ రెండు కాలువలకూ మంచి పేర్లు సూచించాలని అధికారులను కోరారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాలను పర్యాటకంగానూ తీర్చిదిద్దాలన్నారు. గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు, కృష్ణా డెల్టాకు అవసరమైనంత మేర తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉందని.. విశాఖ నుంచి అమరావతి వరకూ అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించాలని సూచించారు. డేటా సెంటర్లకు మొత్తంగా మూడున్నర టీఎంసీలు సరిపోతాయని, అయినా ఈ విషయంలో కొందరు లేనిపోని విమర్శలు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాసితుల పట్ల మానవతా దృక్పథంతో..
రాష్ట్రవ్యాప్తంగా జల వనరుల శాఖ అధీనంలో ఉన్న భూములను సర్వినియోగం చేసుకునే అవకాశాలను అధ్యయనం చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 36 ప్రాధాన్య ప్రాజెక్టులనూ.. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పూర్తి చేయాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఆయకట్టుకు నీరిచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. సమీక్షలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.