Share News

తెలంగాణ నుంచి త్వరలో వక్ఫ్‌ రికార్డుల బదిలీ

ABN , Publish Date - May 20 , 2026 | 04:07 AM

తెలంగాణలో ఉన్న ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డులను త్వరలో రాష్ట్రానికి తీసుకురానున్నట్లు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు.

తెలంగాణ నుంచి త్వరలో వక్ఫ్‌ రికార్డుల బదిలీ

  • బకాయి నిధుల సాధనకూ చర్యలు: అజీజ్‌

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఉన్న ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డులను త్వరలో రాష్ట్రానికి తీసుకురానున్నట్లు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి చెందిన కీలక రికార్డులు, ఫైళ్లు, సర్వే ఫారాలు, జిల్లాల వారీ గెజిట్లు, బోర్డు తీర్మాన ప్రతులు, ఇతర ముఖ్య పత్రాలు గత పదేళ్లుగా తెలంగాణ వక్ఫ్‌బోర్డు పరిధిలోనే ఉండిపోయాయని మంగళవారం తెలిపారు. వక్ఫ్‌ చట్టం-1995, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విభజన మార్గదర్శకాల ప్రకారం ఏపీకి సంబంధించిన అన్ని రికార్డులు, ఆస్తుల వివరాలు, నిధులు ఏపీ వక్ఫ్‌ బోర్డుకు బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు. దీని కోసం తాను తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ను కలిశానని, ఆ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవో, ఇతర ఉన్నతాధికారులతోనూ పలుమార్లు సమావేశాలు నిర్వహించానని, అధికారిక లేఖల ద్వారా కూడా సంప్రదింపులు కొనసాగించానని తెలిపారు. రికార్డులను తెలంగాణ సీఈవోకు అందించిన తర్వాత ఏపీ వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఏపీ వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన మొత్తం 2971 ఫైళ్లు, 8 సర్వే కమిషనర్‌ రిపోర్టు పుస్తకాలు, 3 గెజిట్లు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు వద్ద ఉన్నాయని, రూ.55.5 కోట్ల ఆర్థిక బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. వక్ఫ్‌ ఆస్తుల రక్షణలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

Updated Date - May 20 , 2026 | 04:07 AM